Telangana CM Revanth Reddy : తెలంగాణలో బదిలీల పర్వం.. రెడీ అవుతున్న రేవంత్ రెడ్డి టీం

తెలంగాణ రాష్ట్రంలో ‘‘మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కీలక అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ పాలనలో కీలకస్థానాల్లో ఉన్న ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను మారుస్తూ, నిజాయితీగా, సమర్ధంగా పనిచేసే అధికారులను కీలక స్థానాల్లో నియమిస్తున్నారు....

Telangana CM Revanth Reddy : తెలంగాణలో బదిలీల పర్వం.. రెడీ అవుతున్న రేవంత్ రెడ్డి టీం

Telangana CM Revanth Reddy

Telangana CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ‘‘మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కీలక అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ పాలనలో కీలకస్థానాల్లో ఉన్న ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను మారుస్తూ, నిజాయితీగా, సమర్ధంగా పనిచేసే అధికారులను కీలక స్థానాల్లో నియమిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీఎంఓలోకి కొత్త అధికారులను నియమించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

సీఎంఓ టీం నియాామకానికి సీఎం కసరత్తు

ఇప్పటికే కొందరు అధికారులను సీఎంఓలోకి సీఎం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టి అయిదు రోజులు కావస్తున్నా ఇంకా పూర్తిస్థాయి సీఎంఓ టీంను తీసుకురాలేదు. మినీ సెక్రటేరియట్‌గా ఉండే ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎం రోజువారీ వ్యవహారాలను నిర్వహించడానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ముగ్గురు సెక్రటరీ స్థాయి అధికారులు అవసరం.ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వి.శేషాద్రిని నియమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడలేదు.

సలహాదారుల నియామకాలకు బ్రేక్

శేషాద్రి మాత్రం కొత్త ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న అన్ని సమీక్షా సమావేశాలకు హాజరవుతున్నారు. కేసీఆర్ హయాంలో సీఎంఓలో సెక్రటరీగా ఉన్న స్మిత సబర్వాల్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఉన్న ప్రియాంక వర్గీస్ లపై బదిలీ వేటు వేయనున్నారు. గతంలో కేసీఆర్ నియమించిన సలహాదారులైన రిటైర్డు అధికారుల పదవీ కాలాన్ని రద్దు చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో సీఎం ఆదేశాలు జారీ చేయించారు.రాజీవ్ శర్మ, సోమేష్ కుమార్, ఎస్.కె. జోషి, ఎ.కె. గోయల్, ఎ. రామ లక్ష్మణ్, బి.వి.పాపా రావు, కె.వి. రమణా చారి, జీఆర్ రెడ్డి, ఏకే ఖాన్,అనురాగ్ శర్మ, అధర్ సిన్హా,రాణి కుముదినిల పదవీకాలాన్ని రద్దు చేశారు.

కీలక అధికారుల నియామకం

ఆలిండియా సివిల్ సర్వెంట్ల జాబితాలో తెలంగాణకు 170 మంది అధికారులున్నారు. కొత్త సీఎం రేవంత్ రెడ్డి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి తనదైన టీంను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ నగర పోలీసు కమిషనరుగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాశ్ మహంతి, రాచకొండ సీపీగా సుధీర్ బాబును నియమించారు. ఇంటెలిజెన్స్ సీఎం సెక్యూరిటీ గ్రూప్ లోకి గుమ్మి చక్రవర్తిని నియమించారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా షానవాజ్ ఖాసింను నియమించారు.

ALSO READ : మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలకు చెక్.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న దందాలు

సందీప్ శాండిల్యాను టీఎస్ న్యాబ్ డైరెక్టరుగా బదిలీ చేశారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నర్సింగ్ రావును ప్రిన్సిపల్ సెక్రటరీగా, 2000 సంవత్సరం బ్యాచ్ అధికారి రాహుల్ బొజ్జా ముఖ్యమంత్రి కార్యదర్శిగా గతంలో కేసీఆర్ వద్ద పనిచేశారు. గతంలో మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి కె. భూపాల్ రెడ్డి సిఎంఓలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు. సిఎంకు మరో ప్రత్యేక కార్యదర్శి పి.రాజ శేఖర్ రెడ్డి గతంలో కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఉన్నారు.

ALSO READ : స్మితా సబర్వాల్ ఔట్, ఆమ్రపాలి ఇన్..! తెలంగాణ సీఎంవోలో కీలక మార్పులు..!

ఐదేళ్ల పదవీకాలం తర్వాత రాజీనామా చేసి సీఎంఓలో చేరారు. కొత్త ముఖ్యమంత్రి అధికారుల్లో తన బృందాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ తన మొదటి ప్రాధాన్యత ఆరు హామీల అమలుకు ఇస్తుండటంతో ఈ కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించేందుకు నిబద్ధత కలిగిన అధికారుల బృందాన్ని నియమించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ఆరుగురు సీనియర్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించనున్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి.

ALSO READ : టీఎస్పీఎస్పీ సభ్యత్వానికి రాజీనామా చేసిన 5 గురు కమిషన్ సభ్యులు

కొందరు ఐఎఎస్ అధికారులు సుదీర్ఘకాలంగా ఒకే పోస్టులో ఉన్నారు. మరికొందరు అదనపు బాధ్యతలు చూస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రక్షాళన తీసుకువచ్చేందుకు కొత్త అధికారులను కీలకస్థానాల్లో నియమిస్తున్నారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక వైపు సమీక్షలు కొనసాగిస్తూనే అధికారుల బదిలీలు, నియామకాలపై కసరత్తు చేస్తున్నారు.