TS Covid Cases Decline : తెలంగాణలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్ కేసులు

Covid Cases Decline
TS Covid Cases Decline : తెలంగాణలో గత రెండు వారాలుగా కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. కొవిడ్ నియంత్రణకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. కొవిడ్ కట్టడికి తెలంగాణ మార్గదర్శిగా మారిందని ఆయన తెలిపారు.
ఇంటింటి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించి మందులు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో కొవిడ్ నియంత్రణలోనే ఉందని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రికవరీ రేటు 90.48 గా ఉందని… రెండో దశలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.37 లక్షల కేసులు నమోదయ్యాయని ఆయన వివరించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 48,110 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు 1,92 లక్షల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని అన్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.56శాతంగా ఉంది’’ అని శ్రీనివాసరావు వివరించారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం వల్లనే సత్ఫలితాలు వస్తున్నాయన్నారు.
కోవిడ్ రోగుల కోసం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సరిపడా పడకలు ఉన్నట్లు తెలిపారు. 40 శాతానికి పైగా పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో నిండాయన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ పడకలు 33 శాతం ఖాళీగా ఉన్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. రాష్ట్రంలో 1,265 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందజేస్తున్నట్లు వివరించారు.
కొవిడ్ చికిత్స కోసం 53,756 పడకలు కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 493 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు. 18 రోజుల్లో పాజిటివిటీ రేటు 50 శాతం తగ్గిందన్నారు. వ్యాక్సినేషన్‌ఫై కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి 57.30 లక్షల వ్యాక్సిన్ డోసులు వచ్చాయన్నారు.
కొవాగ్జిన్ సెకండ్ డోస్ తీసుకోవాల్సినవారు ఇంకా 3 లక్షల మంది ఉన్నారన్నారు. ప్రస్తుతం 50 వేల కోవాగ్జిన్ డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్లోబల్ టెండరింగ్ ద్వారా వ్యాక్సిన్‌ను సమకూర్చుకోనున్నట్లు ఆయన చెప్పారు.