Amit Shah : తెలంగాణలో అమిత్ షా పర్యటన.. ఖమ్మం సభలో పాల్గొననున్న కేంద్రహోంమంత్రి
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్షమందిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. రైతులకు భరోసా ఇచ్చేలా అమిత్ షా సభ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Amit Shah Telangana Tour
Amit Shah Telangana Tour : బీజేపీ అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ అమిత్ షా ఖమ్మంకు కానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 2.50 గంటలకు అమిత్ షా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో అమిత్ షా బయల్దేరి 3.30 గంటలకు ఖమ్మం నగరానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగే సభ వేదిక వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు.
సాయంత్రం 4.40 గంటలకు బహిరంగ సభ ముగియనుంది. అనంతర అక్కడ ఏర్పాటు చేసే పార్టీ కోర్ కమిటీ మీటింగ్ లో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ కోర్ కమిటీ మీటింగ్ సాయంత్రం 5.30 గంటల వరకు జరుగనుంది. అనంతరం సాయంత్రం 5.40 గంటలకు అమిత్ షా ఖమ్మం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు బయల్దేరి వెళ్లనున్నారు. అమిత్ షా సాయంత్రం 6.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు.
కొన్ని అనివార్య కారాణాల వల్ల భద్రాచలంలో అమిత్ షా పర్యటన రద్దు అయిందని బీజేపీ ప్రకటించింది. ఇక బీజేపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో కేంద్రమంత్రి హోదాలో పార్టీ అగ్ర నాయకత్వం ఖమ్మం సభకు రావడం ఇదే తొలిసారి. దీంతో బీజేపీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్షమందిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
రైతులకు భరోసా ఇచ్చేలా అమిత్ షా సభ ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు అమలు చేయనున్న పథకాలను అమిత్ షా ప్రకటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ సభలో అమిత్ షా సమక్షంలో ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు కూడా ఉండే అవకాశం ఉంది.