Bandi Sanjay: గద్దర్‌కు ‘పద్మ అవార్డు’పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: గద్దర్‌కు ‘పద్మ అవార్డు’పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay

Updated On : January 27, 2025 / 6:13 PM IST

Bandi Sanjay: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. అందులో ఏపీ నుంచి ఐదుగురికి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరికి అవార్డులు ప్రకటించింది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఇద్దరికి మాత్రమే పద్మ పురస్కారాలు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మ శ్రీ అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని రేవంత్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని అన్నారు. తాజాగా ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: Nara Lokesh: రోజా కామెంట్స్ పై నారా లోకేశ్ ఫన్నీ కౌంటర్.. దావోస్ ప్రతినిధులుకూడా అదే విషయాన్ని అడుగుతున్నారట..

రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదని, అర్హులకు మాత్రమే అవార్డులు ప్రధానం చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇదే సమయంలో గద్దర్ పేరును ప్రస్తావిస్తూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికి ఇస్తాం. గద్దర్ కు ఎలా ఇస్తాం..? అయన భావజాలం ఏంటి..? బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం..? మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారు.. మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం.. బరాబర్ ఇవ్వం’’ అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.

Also Read: Vijayashanthi: పద్మ అవార్డులపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఇంతమంది ఉన్నా ఏం చేస్తున్నారు.?

తెలంగాణ రాష్ట్రంకు కేవలం రెండు పద్మా పురస్కారాలే దక్కాయంటూ సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే, సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు, గద్దర్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.