National Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం.. ఎంపీ అర‌వింద్‌పై సంజయ్ ప్రశంసలు 

నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. బోర్డు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.

National Turmeric Board: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం.. ఎంపీ అర‌వింద్‌పై సంజయ్ ప్రశంసలు 

Union Minister Piyush Goyal launches National Turmeric Board at Nizamabad

Updated On : January 14, 2025 / 2:51 PM IST

National Turmeric Board: నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. బోర్డు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి వెంట నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని పసుపు కొమ్ముల దండతో అరవింద్ సత్కరించారు. అనంతరం ఎంపీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. బోర్డు ఏర్పాటుతో నా హామీ పూర్తికాలేదు.. నిజామాబాద్ కు ఇంకా చాలా వస్తాయి. ఇంకా చాలా చేస్తానని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కేవలం రైతులకు మాత్రమే కాదు, జిల్లా మొత్తానికి పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుంది. బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుంది. ఎగుమతులకు, స్టోరేజ్, మార్కెటింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ సహా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. సంక్రాంతి రోజున లక్షలాది మంది పసుపు రైతుల కల నెరవేర్చిన ప్రధాని మోడీకి ధర్మపురి అరవింద్ పాదాభివందనాలు తెలిపారు.


మోడీ చెప్పారంటే నెరవేరి తీరుతుంది : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంక్రాంతి జరుపుకుంటున్న ప్రజలకు పీయూష్ గోయల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధర్మపురి అరవింద్, బండి సంజయ్ కోరిక మేరకు సంక్రాంతి రోజున పసుపు బోర్డును ప్రారంభిస్తున్నాము. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మేఘాలయ సహా 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండించే రైతులకోసం మోడీ ఒక బహుమతిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ఏదైనా చెప్పారంటే అది నెరవేరి తీరుతుంది. కాశ్మీర్ లో టన్నెల్ అయినా, రైతులకు ఇచ్చే సంక్షేమ, అభివృద్ధి పథకాలైనా, స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సహకాలైన ఏదైనా సరే.. మాట ఇచ్చారంటే అమలు చేసి తీరుతారని పీయూష్ గోయల్ కొనియాడారు. ప్రపంచంలోని 19 దేశాలు ప్రధాని మోడీని సర్వోన్నత పౌరపురస్కారాలతో సత్కరించాయి. ఇది మామూలు విషయం కాదు.

పసుపు పంటను వ్యవసాయంలో బంగారంతో పోల్చుతాం. అలాంటి పంట సాగు కోసం ఈ బోర్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గత ఏడాది మూడు లక్షల హెక్టార్లలో పంట సాగు చేసి 11 లక్షల టన్నుల ఉత్పత్తి చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వెరైటీ పసుపు పంట సాగు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 30 వెరైటీలు సాగు చేస్తున్నారు. వాటికి జియో ట్యాగ్ కూడా ఉంది.

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ముఖ్యమైన వెరైటీ పంట పెద్ద మొత్తంలో సాగవుతుంది. అందుకే బోర్డు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అరవింద్, బండి సంజయ్ ఈ బోర్డు కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి సాధించారు. కొత్త వంగడాలపై పరిశోధనలు, పసుపు పంటకు వాల్యూ ఎడిషన్ చేసి ఎగుమతులు చేస్తాం. అలాగే పసుపు ఉపయోగాలపై కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. పంట దిగుబడి పెంచడం, సప్లయ్ చైన్, మౌలిక వసతులు పెంపొందించడం, ఔషధ గుణాల నేపథ్యంలో ఫార్మా రంగంలో దీన్ని ఉపయోగించడం సహా అనేక అంశాల్లో రైతులకు బోర్డు నుంచి మద్దతు లభిస్తుంది.


పట్టుదలతో అరవింద్ తన హామీ నెరవేర్చుకున్నారు : బండి సంజయ్
రైతుల పండుగ రోజున ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఒక గొప్ప మేలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నేషనల్ పసుపు బోర్డు  ప్రారంభ కార్యక్రమంలో వర్చుల్ గా బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్ కుమార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అయిన పసుపు బోర్డు ఏర్పాటును మొండి పట్టుదలతో నెరవేర్చుకున్నారని కొనియాడారు. మకర సంక్రమణం శుభ సమయంలో రైతుల కల నెరవేరింది. గతంలో నిజామాబాద్ ఎంపీలుగా చాలా మంది చేశారు. కానీ, అరవింద్ ఒక్కరే బాండ్ పేపర్ మీద రాసిచ్చి మరీ తన హామీ నిలబెట్టుకున్నారు. అరవింద్ కు హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నా. బోర్డు ద్వారా నూతన వంగడాలు, పరిశోధనలు, భూసారం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి – ఆదాయం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుంది. పసుపు బోర్డు నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి, నిల్వ చేసి, ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే అవకాశం ఉంది. రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వమే. అలాంటి మోదీకి రైతులు తమ ఆశీర్వాదం అందించాలని బండి సంజయ్ కోరారు.