YS Sharmila : ఏపీనా? తెలంగాణనా? ఆ ప్రచారానికి తెరదించిన వైఎస్ షర్మిల, సోనియాతో భేటీ తర్వాత కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. తద్వార విలీనం తర్వాత కూడా తాను ..YS Sharmila - Telangana

YS Sharmila : ఏపీనా? తెలంగాణనా? ఆ ప్రచారానికి తెరదించిన వైఎస్ షర్మిల, సోనియాతో భేటీ తర్వాత కీలక వ్యాఖ్యలు

YS Sharmila

YS Sharmila – Telangana : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కూడా షర్మిల రాజకీయ క్షేత్రం తెలంగాణనేనా? ఇంతకుముందు లానే పార్టీ విలీనం తర్వాత కూడా తెలంగాణ వేదికగానే షర్మిల రాజకీయ కార్యకలాపాలు సాగనున్నాయా? సుదీర్ఘ పాదయాత్ర చేసిన తెలంగాణలోనే రాజకీయ భవిష్యత్తు వెతుక్కోవాలన్నది షర్మిల సంకల్పమా? కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత షర్మిల మాటలు చూస్తే ఇదే అభిప్రాయం కలుగుతోంది.

సోనియా నివాసం నుంచి భర్త అనిల్ తో కలిసి బయటకు వచ్చిన వెంటనే షర్మిల మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీని కలిశానని, చాలా నిర్మాణాత్మకమైన చర్చ జరిగిందని చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంటుందన్నారు షర్మిల. కేసీఆర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. తద్వార విలీనం తర్వాత కూడా తాను తెలంగాణ రాజకీయాల్లో మాత్రమే భాగం అవ్వబోతున్నట్లు పరోక్షంగా చెప్పారు షర్మిల.(YS Sharmila)

Also Read..Telangana Congress: కాంగ్రెస్‌ పార్టీలో హాట్‌హాట్‌గా మారిన ఫ్యామిలీ పాలిటిక్స్‌!

వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం గురించి షర్మిల స్పష్టంగా ఏమీ చెప్పనప్పటికీ.. తాను తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగనున్నానని మాత్రం తేల్చి చెప్పారు. నిజానికి నాలుగైదు నెలలుగా కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనంపై ప్రచారం జరుగుతోంది. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత డీకే శివకుమార్ తో షర్మిల భేటీ అయిన దగ్గరి నుంచి ఈ ప్రచారం మొదలైంది.

అయితే, మొదటి నుంచి షర్మిల సేవలు ఏపీలో వినియోగించుకుంటారనే ప్రచారం నడిచింది. అయితే, ఏపీ రాజకీయాలు పూర్తిగా వదిలేసి రెండేళ్ల క్రితం తండ్రి వైఎస్ఆర్ పేరుతో తెలంగాణలో పార్టీలో పెట్టిన షర్మిల.. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పాదయాత్ర చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాను తెలంగాణ కోడలిని అని, తన మెట్టినిల్లు ఇదే కాబట్టి తాను ఇక్కడి మహిళనే అని చెబుతూ వచ్చారు. మళ్లీ ఏపీ రాజకీయాలకు వెళ్లేందుకు షర్మిల ఆసక్తి చూపడం లేదు.

మరోవైపు షర్మిల పార్టీ విలీనంపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల సేవలు ఏపీలో వినియోగించుకోవాలని టీ కాంగ్రెస్ నేతలు కోరినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ప్రచారానికి చెక్ పెట్టేలా తాను తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగనున్నానని షర్మిల క్లారిటీ ఇచ్చారు. మరోవైపు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలిగా పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలోనే షర్మిల ప్రకటించారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా తనకు పాలేరు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు షర్మిల.(YS Sharmila)

Also Read.. Karimnagar: కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో సింహం సింబల్ హవా.. ఎందుకో తెలుసా?

అయితే షర్మిలను వ్యతిరేకిస్తున్న వారు పాలేరు టికెట్ కాకుండా ఆమెకు సికింద్రాబాద్ టికెట్ కేటాయించాలని చెబుతున్నారు. పాలేరు నుంచి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుని బరిలో దింపే యోచనలో టీ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మొత్తంగా పార్టీ విలీనం తర్వాత కూడా తెలంగాణ రాజకీయాల్లోనే షర్మిల కొనసాగనున్నారన్నది తేలిపోయింది.