గత కొన్నాళ్లుగా గమ్మున ఉంటున్న మల్లన్న.. రేవంత్‌ను కలిశాకే ఆయన మౌనంగా ఉంటున్నారని టాక్
అనవసరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వం దృష్టిలో పడితే తన వ్యాపారాలకే నష్టమన్న భావిస్తున్నారట మల్లన్న.

Malla Reddy
తెలంగాణ మల్లన్న. ఆయనే మాజీమంత్రి మల్లారెడ్డి. మల్కాజ్‌గిరి ఎంపీగా పనిచేసి..ఆ తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మాజీమంత్రిగా ఉండిపోయారు. పదవి ముచ్చట పక్కన పెడితే..బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డికి పెద్దకష్టమే వచ్చి పడింది. బీఆర్ఎస్ హయాంలో కాలేజీ ఫంక్షన్లలో, పబ్లిక్‌లో తిరుగుతూ, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ..నవ్వులు పూయించేవారు. ఆఖరికి అసెంబ్లీలో ఆయన మాట్లాడినా స్పీకర్, సీఎం సహా అందరు కడుపుబ్బా నవ్వాల్సిందే. ఇదంతా వన్ ఇయర్ బ్యాక్. కట్ చేస్తే ఇప్పుడు ఆయన పరిస్థితి గమ్మత్తుగా మారింది.
ఏమైందో ఏమోగాని కొన్ని రోజులుగా మల్లారెడ్డి సైలెంట్‌గా ఉంటున్నారు. మౌనంగా ఉండటమే కాదు..ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయపరమైన కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. సొంత పార్టీ బీఆర్ఎస్ ప్రోగ్రామ్స్‌కు సాధ్యమైనంత వరకు దూరంగానే ఉంటున్నారు. చిన్నా చితక కార్యక్రమాలకు కూడా హాజరై సందడి చేసే మల్లన్న ఎందుకు సైలెంట్ అయిపోయారన్నది ఎవ్వరికి అంతుపట్టడం లేదట.
పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదు?
మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదని బీఆర్ఎస్ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ప్రోగ్రామ్‌కు వచ్చినా ఇంతకు ముందులా మాట్లాడటం లేదట. అయితే మౌనంగా ఉండిపోవడం, లేకపోతే పైపైనే మాట్లాడి చేతులు దులుపుకుంటున్నారట. దీంతో మల్లన్న మౌనానికి కారణం ఏమై ఉంటుందన్న చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది.
ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయాన్ని లేవనెత్తుతున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. మొన్నామధ్య జరిగిన మల్లారెడ్డి మనుమరాలు పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అప్పటి నుంచే మల్లారెడ్డి సైలెంట్ అయిపోయారట. ఏం జరిగిందో తెలియదు గానీ..అంతకు ముందు ఏపీ సీఎం చంద్రబాబును, ఆ తర్వాత తన మనవరాలి పెళ్లిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాక మల్లారెడ్డి ఒక్కసారిగా మౌనం దాల్చారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Bandi Sanjay: బండి సంజయ్ ఆ బాణం రెండు దిక్కులా తాకిందా?
వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా?
మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు అల్లుడి విద్యాసంస్థలు, ఇతర వ్యాపారాలను దృష్టిలో పెట్టుకునే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అనవసరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వం దృష్టిలో పడితే తన వ్యాపారాలకే నష్టమన్న భావిస్తున్నారట మల్లన్న.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక..బీజేపీ గూటికి చేరే ప్రయత్నం చేశారట మల్లారెడ్డి. అయితే కమలం పార్టీ అంత సానుకూలంగా స్పందించ లేదంటున్నారు. ఇంతలోనే తన విద్యాసంస్థలపై హైడ్రా బుల్డోజర్ దించడంతో అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు ట్రై చేశారు. బెంగళూరు వెళ్లి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రాయబారం కూడా నడిపి వచ్చారు. కానీ హస్తం పార్టీ కూడా మల్లారెడ్డిని చేర్చుకునేంకుదు పెద్దగా ఇంట్రస్ట్ చూపలేదట.
దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు మల్లారెడ్డి. ఆ తర్వాత కొన్నాళ్ల వరకు బీఆర్ఎస్‌లో బాగా యాక్టీవ్‌గా ఉన్న మల్లన్న ఇలా హఠాత్తుగా సైలెంట్ అయిపోవడమే ఇంట్రెస్టింగ్‌గా మారింది. మనవరాలి పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యాకే మల్లారెడ్డిలో మార్పు వచ్చిందని..అపోజిషన్‌లో ఉండటంతో మల్లన్న ఆచితూచి వ్యవహరిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.