బ్రహ్మోత్సవాలు అడ్డు పెట్టుకుని ఎర్రచందనం స్మగ్లింగ్

  • Published By: vamsi ,Published On : October 10, 2019 / 07:29 AM IST
బ్రహ్మోత్సవాలు అడ్డు పెట్టుకుని ఎర్రచందనం స్మగ్లింగ్

Updated On : October 10, 2019 / 7:29 AM IST

ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించిపోయారు. ఏకంగా తిరుమల నుంచే ఎర్రచందనం అక్రమ రవాణాకు దిగుతున్నారు. బ్రహ్మోత్సవాలను అడ్డం పెట్టుకుని భక్తుల ముసుగులో తమిళ దొంగలు దర్జాగా ఎర్రచందనాన్ని కొండపై నుంచి తరలించేస్తున్నారు. తిరుమల అలిపిరి వద్ద ఓ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు అందులో 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు టోల్‌గేట్లు దాటి వచ్చినా ఆ వాహనంలో ఏముందన్నది పోలీసులు పసిగట్టలేకపోయారు. భక్తుల ముసుగులో వచ్చి దర్జాగా ఎర్రచందనాన్ని తీసుకువెళ్లినట్లు అనుమానిస్తున్నారు అధికారులు.

బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీని తమకు అనుకూలంగా ఉపయోగించున్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుమల నుంచి ఎర్ర చందనం దుంగలను రవాణా చేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నించగా, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అలిపిరి వద్ద పక్కా సమాచారంతో స్మగ్లర్లను పట్టుకున్నారు. ఇప్పటికే డాగ్‌ స్క్వాడ్‌, ఇతర టీమ్‌ లు శేషాచలం పరిసరాల్లో తనిఖీలు చేపడుతున్నారు. గురువారం(10 అక్టోబర్ 2019) తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఒక టాటా సఫారీ వాహనం, పూజలు చేసుకుని వస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆపి చెక్ చేయగా అసలు విషయం బయటపడింది.

వాహనం ముందు భాగాన పూలతో అలంకరించి ఉండగా అందులో 13 ఎర్రచందనం దుంగలు లభించాయి. దుంగలతో పాటు నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. వారిని మురుగేశన్‌ జయపాల్‌ (25), రామలింగం అరుణాచలం (30), భూపాల్‌ కందస్వామి (27), డ్రైవర్‌ పెరుమాళ్‌ వేలు (35) లుగా గుర్తించారు పోలీసులు. టిఎన్‌ 07 ఎఎల్‌ 3903 నెంబరు ఉన్న ఈ వాహనం ఐదు సార్లు తిరుమలకు వచ్చి ఎర్ర చందనం దుంగలను రవాణా చేసినట్లు విచారణలో వెల్లడైంది.