చంద్రబాబుతోనే ఏపీ అభివృధ్ధి సాధ్యం: మమతా బెనర్జీ

విశాఖపట్నం: తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ, అమిత్ షా ద్వయం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. అందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో చోటు చేసుకున్న పరిణామాలే సాక్ష్యమని ఆమె అన్నారు. రాష్ట్రాలను భయభ్రాంతులను చేయడం ద్వారా మోడీ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు మాత్రమే న్యాయం చేయగలరని విశాఖ పట్నంలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో ఆమె చెప్పారు. గత ఎన్నికల్లో చాయ్‌వాలా అని ప్రచారం చేసుకున్న మోడీ ఇప్పుడు చౌకీదార్ అంటూ కొత్త నాటకం ప్రారంభించారని విమర్శించారు.
మోడీ ఎవరికి కాపాలాదారుడుగా ఉన్నారో చెప్పాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. దేశాన్ని లూటీ చేసేవారికి మోడీ చౌకీదార్ గా ఉన్నారని మమత ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయందని ఆమె విమర్శించారు. ప్రధాని మోదీకి విలేకరులను ఎదుర్కోవటంచేతకాదని, అధికారంలో ఉండగా ఒక్కసారికూడా విలేకరుల సమావేశం నిర్వహించలేదని తెలిపారు. ప్రస్తుతం దేశభక్తి పేరుతో దేశాన్ని అమ్మేసే దేశభక్తులు తయారయ్యారని మమతా బెనర్జీ చురకలు అంటించారు. బీజేపీని, దాని మిత్రులను ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.