తిరుమలలో ఫ్రీ లడ్డూ నేటి నుంచే: కండిషన్స్ అప్లై

తిరుమలలో ఫ్రీ లడ్డూ నేటి నుంచే: కండిషన్స్ అప్లై

TTD Laddu

Updated On : January 20, 2020 / 1:08 AM IST

తిరుమల శ్రీవారి ఉచిత లడ్డూలు నేటి నుంచే పంపిణీ చేయనున్నారు. గతంలో అమలులో విధానాన్ని పూర్తిగా మారుస్తూ.. ఒక్క భక్తునికి ఒక్క లడ్డూ మాత్రమే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో రాయితీ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం అర్ధరాత్రి నుంచి రద్దు చేశారు. ప్రస్తుతం పలు రకాలుగా దర్శనం చేసుకునే యాత్రికులకు ఉచితంగా రాయితీలపై లడ్డూలను అందజేస్తున్నారు. 

సేవా టికెట్లు, బ్రేక్‌ దర్శనం టికెట్ల ద్వారా దర్శనం చేసుకునే వారికి రెండు లడ్డూలను ఉచితంగా ఇచ్చేవారు. ఇకపై భక్తునికి ప్రసాదం కింద 175 గ్రాములు లడ్డూని మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం అందించనుంది. సేవా టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లలో శ్రీవారిని దర్శించుకునే యాత్రికులకు ఆదివారం అర్ధరాత్రి నుంచి కేవలం ఒక్క లడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. 

లడ్డూ టోకెన్‌ జారీలో సాంకేతిక మార్పులు చేసి ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నట్లు అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అదనంగా భక్తులు ఎక్కువ లడ్డూలు కావాలనుకుంటే లడ్డూ కాంప్లెక్సులోని ఎల్‌పీటీ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. ఇంతకుముందు ఉన్న నాలుగు ఎల్‌పీటీ కౌంటర్లను 12 కౌంటర్లకు పెంచుతున్నామని ధర్మారెడ్డి తెలిపారు.