కోనసీమకు వరద ఉధృతి : గ్రామాలకు రాకపోకలు బంద్

కోనసీమకు వరద ఉధృతి తాకింది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కోనసీమ నదీ పాయల్లో వరద పోటెత్తుతోంది. పి.గన్నవరం (మండలం) కనకాయలంక కాజ్ వే నీట మునిగిపోయింది. కనకాయలంక, చాకలిపాలెం, నాగుల్లంక గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నాయని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు మరింత బలపడి..కోస్తాంధ్రలో రాగల 24 గంటల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదిలా ఉంటే..గోదావరిలో వరద పెరుగుతోంది. ముంపు మండలాల్లో రోడ్డుమార్గాలు నీట మునగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టుకు ఎగువన 19 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్‌వేపై 8 అడుగుల వరదనీరు చేరింది. గత రెండు నెలల్లో కొత్తూరు కాజ్‌వేపై వరదనీరు చేరడం ఇది ఐదోసారి. ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుల్లోని పలు ప్రాంతాల్లోకి వరద చేరింది.
వేలేరుపాడు గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్న ఎద్దువాగుపై 4అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం గోదావరి తీర గ్రామాలకు మళ్లీ వరద రావడంతో గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. దేవీపట్నం మండలంలోని గువ్వలపాలెం, ఏ.వీరవరం, తొయ్యూరు, దేవీపట్నం పొలాల్లోకి వరదనీరు చేరింది. ఆర్‌అండ్‌బీ రహదారులపైకి మూడు అడుగుల మేర నీరు చేరడంతో రాకపోకలు నిలిచాయి. సీతపల్లి వాగు దండంగి వరకు వెనక్కి పోటెత్తడంతో సుమారు 36 గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి.