గోదావరి ఉగ్రరూపం : ఉధృతంగా ప్రవహిస్తున్న సోకిలేరు, అత్తాకోడళ్ల వాగులు

తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సోకిలేరు, అత్తాకోడళ్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, ఎటపాక, చింతూరు, వీఆర్ పురం మండలాలు జలదిగ్భందంలో చిక్కుకపోయాయి. దీంతో ఏజెన్సీ, పోలవరం నిర్వాసితులు, కోనసీమ లంక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

గోదావరి ఉగ్రరూపం : ఉధృతంగా ప్రవహిస్తున్న సోకిలేరు, అత్తాకోడళ్ల వాగులు

Godavari Floods In East Godavari

Updated On : September 21, 2021 / 12:23 PM IST

తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సోకిలేరు, అత్తాకోడళ్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, ఎటపాక, చింతూరు, వీఆర్ పురం మండలాలు జలదిగ్భందంలో చిక్కుకపోయాయి. దీంతో ఏజెన్సీ, పోలవరం నిర్వాసితులు, కోనసీమ లంక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

మరోవైపు పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వద్ద భారీగా వరద నీరు చేరుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పోచమ్మగండి, తొయ్యేరు, పూడిపల్లి, మంటూరు, వీరవరం, దండంగి, రమణయ్యపేట గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ బ్యాక్‌ వాటర్స్‌తో దేవీపట్నం మండలంలోని 36 గిరిజన గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది.

గోదావరి పోటెత్తుతుండడంతో పోలవరం ప్రాజెక్ట్‌ పరిధిలోని గ్రామాల ప్రజల్లో టెన్షన్‌ మొదలైంది. ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోండటంతో అధికారులు ఎప్పటికప్పటి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 11.8 అడుగులకు చేరింది.

మేడిగడ్డ నుంచి ఒక్కసారిగా నీరు విడుదల చేయడంతో భూపాలపల్లి జిల్లా పంకేన వద్ద 1500 గొర్రెలతో పాటు ముగ్గురు గొర్రెల కాపరులు గోదావరిలో చిక్కుకున్నారు. వారిని నాటు పడవల ద్వారా  కాపాడి బయటకు తీసుకు వచ్చారు. దాదాపు 40 ఎకరాల పత్తి పంట కూడా నీట మునిగింది. సమాచారం ఇవ్వకుండా బ్యారేజ్‌ గేట్లను ఎత్తినప్పుడల్లా ఇలాంటి పరిస్థితి వస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.