సచిన్ నే మోసం చేసిన రియల్టర్ కోటారెడ్డి

దేశంలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీ, భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలీని మోసం చేసాడు హైదరాబాద్ కు చెందిన రియల్టర్ కోటారెడ్డి. సచిన్ ఫ్యామిలీతో పాటు సినీ తారలు రమ్యకృష్ణ. నయనతారలతో పాటు పలువురు సెలబ్రిటీలను కూడా మోసం చేసినట్లు ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ పదవి నుంచి ఇటీవల ఉద్వాసనకు గురైన సుధీర్ రెడ్డి తెలిపారు.
మహేశ్వరం మండలం రావిర్యాలలో చెరువు శిఖం భూములను రైతుల నుంచి తక్కువ రేట్లకు కొని.. కోట్ల రూపాయలకు అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి. కోటారెడ్డి నుంచి చెరువు ఎఫ్‌టీఎల్ భూములు కొన్నవారిలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ భార్య అంజలి, సినీ తారలు రమ్యకృష్ణ, నయనతారతో పాటు ఎంపీలు కూడా ఉన్నారు.
హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ఈ రావిర్యాల చెరువు ఉంది. ఆ చుట్టు పక్కల నాలుగు గ్రామాల్లో 3 వేల ఎకరాల సాగుకు ఈ చెరువే ఆధారం. కానీ రియల్ ఎస్టెట్ పుణ్యమా ఈ చెరువు కబ్జా కొరల్లో చిక్కుకుపోయింది. ఈ భూమి నిర్మాణాలకు పనికి రాదని, ఆసంగతి తెలియని సచిన్ భూమి కొన్నాడన్నారు. సచిన్ మా బావ ఇంటికి లంచ్ కు కూడా వచ్చాడని సుధీర్ రెడ్డి తెలిపారు.
సచిన్ భార్య అంజలి ఆరు ఎకరాలు, రమ్యకృష్ణ, నయనతార ఎకరం వంతున భూమి కొన్నారు. ఆదిత్య హోమ్స్ అంజలికి భూమి అమ్మడంలో ప్రముఖ వ్యాపారవేత్త, సచిన్ స్నేహితుడితో పాటు కొందరు ఎంపీలకు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
రావిర్యాలలో ఆరు ఎకరాల భూమి కొని సచిన్ భార్య అంజలి మోసపోయిన వ్యవహారంపై కోటారెడ్డి బావమరిది, ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సుధీర్‌రెడ్డి ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు.
లక్షల రూపాయలకు కొన్న భూములను కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆదిత్య హోమ్స్ ఎండీ కోటారెడ్డి మోసాల చిట్టాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో భూములు అమ్మిన కేసులో కోటారెడ్డిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.