రాజధాని రైతులకు పోలీసుల నోటీసులు

అమరావతి రైతులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలకు, సభల నిర్వహణకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజాసంఘాల నాయకులు జనవరి 20 న ఛలో అసెంబ్లీతో పాటు జైల్ భరో, గుంటూరు కలెక్టరేట్ ముట్టడి ,కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు వారికి సెక్షన్ 149 సీఆర్ పీసీ ప్రకారం నోటీసులు ఇచ్చారు.
సమావేశాలు జరిగే రోజుల్లో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. 29 గ్రామాల రైతులతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలకు నోటీసులు ఇచ్చారు. సీపీఐ సీనియర్ నేత ముప్పాళ్ళ నాగేశ్వర రావుతో పాటు టీడీపీ కి చెందిన పలువురు నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఆందోళనల కారణంగా రహదారులపై ట్రాఫిక్ జాం ఏర్పడి సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున… ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు నష్టం కలిగే అవకాశం ఉన్నందున…. గొడవలు జరిగితే ప్రాణ నష్టం జరగవచ్చని అందుకోసం ముందు జాగ్రత్త చర్యగా నోటీసులు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు సహకరించి శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించుకోవాలని సూచిస్తూ…. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.