పోలింగ్ పై జేసీ రివ్యూ : పసుపు-కుంకుమ, పెన్షన్లు లేకపోతే మా పరిస్థితి భగవంతుడికే తెలియాలి

ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో టీడీపీని బతికించింది రెండు పథకాలే…ప్రజలు ఓటుకు రూ. 2 వేల 500 డిమాండ్ చేస్తున్నారంటూ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం బాబు 120 స్కీములు ప్రవేశ పెట్టి..దాన ధర్మాలు చేశారు..ఆయన కష్టాన్ని ఎవరైనా చూశారా ? అన్నారు. ఏపీ రాష్ట్రంలో పసుపు – కుంకుమ, ముసలి వాళ్ల పెన్షన్‌ల పథకాలు టీడీపీని బ్రతికించాయని చెప్పారు. ఈ స్కీంలు లేకపోతే దేవుడికే తెలియాలన్నారు.
ఏప్రిల్ 22వ తేదీ సోమవారం అమరావతిలో సీఎం బాబు అధ్యక్షతన నియోజకవర్గాల మీటింగ్ జరుగుతోంది. దీనికి హాజరైన జేసీ ఎన్నికల ఖర్చు, ఓటర్ల డబ్బు డిమాండ్ తదితర విషయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చేసరికి నువ్వెంత ఇస్తావు..వారు రూ. 2 వేల 500 ఇస్తున్నారు..మీరెంతిస్తారు ? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. తన నియోజకవర్గంలో రూ. 50 కోట్లు ఖర్చు పెట్టారని..ఏపీలోని 175 నియోజకవర్గాల్లో రూ. 10వేల కోట్లు ఖర్చు పెట్టారని సంచలన కామెంట్స్ చేశారు.
ఎన్నికల్లో ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఏమీ లేదని..అన్ని పార్టీలు ఖర్చు చేస్తున్నాయంటూ స్పష్టం చేశారు. ఎన్నికల ఖర్చును తగ్గించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని, ఇందుకు సమావేశాలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌తో చర్చించి కార్యచరణ రూపొందిస్తానని వెల్లడించారు జేసీ దివాకర్ రెడ్డి.