నిజామాబాద్ లో ధాన్యం రైతుల నిరసన

నిజామాబాద్: ధాన్యం కొనుగోలులో క్వింటాల్కు 5 కిలోల తరుగు తీయడం పై నిరసనగా నిజామాబాద్ జిల్లా నవిపెట్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాలం పండించిన పంటకు తరుగు తీసుకొని మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని రైతులు నిరసనకు దిగారు. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న ధాన్యంలో గతంలో క్వింటాల్ కు రెండున్నర కిలోల తరుగు తీసేవారని. ఇప్పుడు ఏకంగా 5 కిలోల తరుగు తీయడం పై రైతులు మండిపడుతున్నారు.
సొసైటీ వారు కొనుగోలు కేంద్రం వద్ద” ఏ ” గ్రేడ్ గా కొనుగోలు చేసి రైసు మిల్లర్స్ వద్ద వెళ్లిన తర్వాత “బి ” గ్రేడ్ గా ఉంది అని మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణమయిన సొసైటీ ఛైర్మెన్ అబ్బన, రైసు మిల్లర్స్ అసోసియేషన్ మోహన్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేసి రైతులు నిరసనను వ్యక్తం చేశారు. రైతులు కోరిక మేరకు ఇకనైనా ప్రభుత్వం స్పందించి మా ధాన్యం కొనుగోలు లో పాత విధానమే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.