అమరావతి మరో తిరుమల : వెంకన్న టెంపుల్

విజయవాడ : ఏపీ రాజధాని అమరావతి మరో తిరుమల కానుంది. అత్యంత సుందరంగా..సమ్మోహనంగా భారీ ఎత్తున వెంకన్న ఆలయాన్ని నిర్మించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఈనెల 31న సీఎం చంద్రబాబు చేతులమీదుగా శంఖుస్థాపన చేయనున్నారు. తిరుమల వెంకన్న ఆలయాన్నిరాజధాని అమరావతిలో భారీ ఎత్తున నిర్మించాలని నిర్ణయించారు. ఆ భాధ్యతను సీఎం టీటీడీకి అప్పగించారు. ఇందుకోసం వెంకటపాలెం దగ్గర 25 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఐదు ఎకరాల్లో ఆలయాన్ని నిర్మిస్తారు. మిగిలిన 20 ఎకరాల్లో కళ్యాణ మండపాలు, ఆలయ నిర్వహణకు, భక్తులకు అవసరమైన ఏర్పట్లకు తగిన నిర్మాణాలు, పార్కులు నిర్మిస్తారు. ఈ టెంపుల్ నిర్మాణానికి సంబంధించి డిజైన్స్ కూడా ఓకే అయ్యాయి. టెంపుల్ నిర్మాణం సందర్భంగా టీటీడీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయనుంది. నిర్మాణ పనులకు ఈనెల 31న సీఎం చంద్రబాబు శంఖువస్థాపన చేస్తారు.
వెంకటపాలెం దగ్గర 25 ఎకరాలు.
ఐదు ఎకరాల్లో ఆలయం నిర్మాణం.
20 ఎకరాల్లో కళ్యాణ మండపాలు.
ఆలయ నిర్వహణకు, భక్తులకు అవసరమైన నిర్మాణాలు, పార్కులు.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆలయ ప్రదేశంలో వసంతోత్సవం, స్నపన తిరుమంజనం, చతుర్వేద పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2న చతుర్వేద పారాయణం, స్నపన తిరుమంజనం, ఫిబ్రవరి 3న బుగ్వేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 4న యజుర్వేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 5న సామవేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 6న అధర్వణవేద పారాయణం, భక్తి సంగీతం, ఊంజల్ సేవ, ఫిబ్రవరి 7న ఆచార్యవరణం, అంకురార్పణ, ఫిబ్రవరి 8న చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమం, ఫిబ్రవరి 9న చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమం, ఫిబ్రవరి 10న చతుర్వేద పారాయణం, యాగశాల కార్యక్రమం, మీనలగ్నం నందు ప్రధమ శిలేష్టకాన్యాసము, పూర్ణాహుతి, వేదాశీర్వాద కార్యక్రమాలు నిర్వహిస్తారు. తిరిగి ఫిబ్రవరి 28వ తేదీ నుంచి టీటీడీ పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది. తిరుమల తిరుపతి తరువాత ఆ స్థాయిలో వెంకన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తుండటంతో .. అమరావతి మరో తిరుమల కానుందనడంలో సందేహం లేదు.