వాట్ యాన్ ఐడియా : పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే WhatsAppలో ఫిర్యాదు

  • Published By: madhu ,Published On : April 18, 2019 / 12:55 PM IST
వాట్ యాన్ ఐడియా : పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండానే WhatsAppలో ఫిర్యాదు

Updated On : April 18, 2019 / 12:55 PM IST

గతంలో ఏదైనా జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలంటే ఎంతో శ్రమ పడాల్సి వచ్చేది. పోలీస్ స్టేషన్ లో పడిగాపులు కాయల్సిన దుస్థితి ఏర్పడేది. అంతకన్నా పోలీస్ స్టేషన్‌ల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే ఇప్పుడలాంటి బాదర బందీ లేదంటున్నారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు. తమకు జరిగిన అన్యాయాన్నే కాదు.. తమ చుట్టూ జరిగే దుస్సంఘటనలను సైతం వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చెయ్యొచ్చని ప్రచారం చేస్తున్నారు. 

మీ ప్రాంతంలో ఏదైనా భయానక ఘటన జరిగిందా..? లేక మీ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలని భావించినప్పటికీ.. వెళ్ళలేకపోతున్నారా..? దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు.. ఇలాంటివి ఏవైనా సరే పోలీస్ స్టేషన్ కు వెళ్ళకుండానే ఫిర్యాదు చేసే అవకాశం దొరుకుతోంది. ఆ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా పంపిస్తే చాలు కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి.. సంబంధింత స్టేషన్‌ను అప్రమత్తం చేసి.. సమస్య త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించారు సిక్కోలు పోలీసులు.
Also Read : హైదరాబాద్‌లో ఈడీ సోదాలు : రూ.82 కోట్ల విలువైన 146కిలోల బంగారం స్వాధీనం

సాంకేతిక వినియోగంలో మరో అడుగు ముందుకేసి.. ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇటీవల జిల్లా ఎస్పీగా భాధ్యతలు చేపట్టిన నవదీప్ సింగ్ గ్రేవాల్.. జిల్లా ప్రజలకు వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. పోలీసులకు ఈ నంబర్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. పోలిస్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం అయ్యి ఉండి.. త్వరితగతిన సమస్య పరిష్కారం అయ్యే దిశగా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఎక్కువగా గ్రామాల్లో కొట్లాటలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుందని జిల్లా పోలీసులు భావిస్తున్నారు.

ఘటనా ప్రాంతం, జరిగిన తీరును ఫోటో, వీడియో తీసి నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు పంపించవచ్చు. దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు, పోలీసులకు కంట్రోల్ రూమ్ నుండి సమాచారం అందుతుంది. తర్వాత ఆ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించే తీరు కూడా ఎస్పీ నేరుగా సమీక్షించే అవకాశం ఉండటంతో త్వరిగతిన పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే కేవలం ఫిర్యాదులు స్వీకరించే పోలీసులు ఇక నుంచి 6309 990 933 వాట్సాప్‌ నంబర్‌తో ఎక్కడైనా శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

కేవలం వాట్సాప్‌లో అత్యవసర సమాచారం, ఫిర్యాదు మాత్రమే పంపించాలని వీటితో పాటు ఫొటోలు, వీడియోలు కుడా షేర్‌ చేసేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రధానంగా ఈవ్‌టీజింగ్, ట్రాఫిక్‌ సమస్యలు, మారక ద్రవ్యాలు రవాణా, పేకాట, బాలికల అక్రమ రవాణా, అనుమాస్పద వ్యక్తుల సంచారంతో పాటు ఆయా ప్రాంత పరిసరాల్లో తగాదాలు వంటివి ఫొటో ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వాట్సాప్‌ ద్వారా తగు సమాచారం పంపిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ తెలిపారు.  
Also Read : మే.. లోనే లాంచ్ : శాంసంగ్ నుంచి మడతబెట్టే ఫోన్