రెబల్స్‌ రచ్చ : ఎవరి కొంప ముంచుతారో

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 04:05 PM IST
రెబల్స్‌ రచ్చ : ఎవరి కొంప ముంచుతారో

నిన్నటి వరకూ టికెట్‌ వస్తుందని ఆశపడ్డారు. తామే అభ్యర్ధిగా బరిలో నిలుస్తామని ఉత్సాహపడ్డారు. కానీ అధినేతల దృష్టిలో వారు పడకపోవడంతో .. ఇప్పుడు నేతలు నిరాశలో మునిగిపోతున్నారు. ఏళ్లతరబడి పార్టీ కోసం కష్టపడి.. జెండా మోసిన తమకు టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో.. కొందరు పార్టీలు మారుతుండగా.. మరికొందరు రెబల్‌ అభ్యర్ధులుగా బరిలో దిగుతున్నారు. 

అధికార పార్టీ TDPలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తొలి జాబితాలో తనకు సీటు దక్కకపోవడంతో టీడీపీ మాజీ మంత్రి,  చింతలపూడి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పీతల సుజాతకు టీడీపీ తొలి జాబితాలో టికెట్‌ దక్కలేదు. ఆమె స్థానంలో కర్రా రాజారావుకు టీడీపీ కేటాయించింది. మంత్రి జవహర్‌కు వ్యతిరేకంగా కొవ్వూరులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఆ సీటునైనా కేటాయించాలని సుజాత చంద్రబాబును కోరినా ఫలితం లేకుండా పోయింది. ఆ సీటును వంగలపూడి అనితకు కేటాయించారు. దీంతో సుజాత భవితవ్యం డోలాయమానంలో పడింది. రెండ్రోజులుగా సుజాత ఫోన్‌ స్విచ్చాఫ్‌లో ఉంది.  ఉంగుటూరులో సీఎం ప్రచారసభకు కూడా ఆమె హాజరుకాలేదు. చింతలపూడిలో పీతల సుజాతవర్గం సమావేశమైంది. పార్టీ మారాలని లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని వారు కోరుతున్నారు. అయితే సుజాత ఏం చేస్తారన్నది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. 
విజయనగరం జిల్లాలో రెబల్‌ అభ్యర్ధితో నామినేషన్ల పర్వం మొదలైంది. చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీ నేత కె.త్రిమూర్తుల రాజు రెబల్ అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేశారు. తనకు కాకుండా సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృణాళిని కుటుంబానికి టిక్కెట్‌ కేటాయించడంపై మనస్తాపంతో త్రిమూర్తుల రాజు వర్గం రెబల్‌గా మారింది. 

వైసీపీలో :
–  వైసీపీలో సీట్లు రాని నేతలు అధిష్టానంపై ఫైర్‌ అవుతున్నారు. విశాఖ తూర్పులో వైసీపీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్‌ను కాదని, చివరి నిమిషంలో విజయనిర్మల పేరును ప్రకటించడంతో. వంశీకృష్ణ అనుచరులు వైసీపీ నగర కార్యాలయం దగ్గర ప్లెక్సీలు చించివేశారు. ఒత్తిడి కారణంగా విజయనిర్మలకు సీటిచ్చారంటూ భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇంటెదుట కూడా ఆందోళన చేశారు. నిన్న కాక మొన్న పార్టీలో చేరిన ద్రోణంరాజు శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వడంతో.. విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న డాక్టర్ రమణ మూర్తి అభిమానులు స్థానిక వైసీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కృష్ణవంశీకి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చినట్టు సమాచారం. 
–  పాలకొల్లులో రెండ్రోజుల క్రితమే వైసీపీలో చేరిన డాక్టర్ బాబ్జికి టికెట్ కేటాయించింది. పార్టీ సమన్వయకర్త గుండం నాగబాబు ఆగ్రహం చెంది కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాదు నాగబాబు జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారు. 
–  టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నందికొట్కూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. 
–  పెద్దాపురంలో తోటవాణికి టికెట్ ఇవ్వడంపై అక్కడ పార్టీ సమన్వయకర్త దొరబాబు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. 
–  కృష్ణా జిల్లా పెడనలో ఉప్పాల రాంప్రసాద్, విజయవాడ తూర్పులో యలమంచిలి రవి వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. 
–  విశాఖపట్నం యలమంచిలి టికెట్ దక్కకపోవడంతో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన నాగేశ్వరరావు, మరో ఆశావహ నేత ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. 
–  పార్వతీపురంలో జోగారావుకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ప్రసన్న కుమార్ వర్గీయులు నిరసన చేశారు.
–  గుంటూరు జిల్లా పొన్నూరులో కిలారు రోశయ్యను అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ వైసీపీ సమన్వయకర్త రావి వెంకటరమణ అసంతృప్తి చెందారు. పొన్నూరు మున్సిపాలిటీలో 13 మంది వైసీపీ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. 
–  రంపచోడవరంలో కోడి సుజాత వైసీపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధపడ్డారు. 
–  పాడేరు వైసీపీ సీటు మత్సరాస బాలరాజుకు కేటాయించక పోవడండంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 
మొత్తం మీద అన్ని పార్టీల్లోనూ ఈ అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. హై కమాండ్ జోక్యం చేసుకుని రెబల్స్‌ను బుజ్జగించాలని కోరుతున్నారు. మరి వీరిలో ఎంతమంది దారికొస్తారో ఇంకెంతమంది పార్టీ కొంపముంచుతారో చూడాలి.