వీడియో నిజమేనా : చిలకలూరిపేట కంభంపాడులో టీడీపీ బూత్ రిగ్గింగ్

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం కంభంపాడు గ్రామంలోని పోలింగ్ బూత్ లో టీడీపీ బూత్ రిగ్గింగ్ కు పాల్పడుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలింగ్ సమయం 6 గంటల వరకు ఉన్నా.. 4 గంటల సమయంలోనే పోలింగ్ బూత్ తలుపులు మూసివేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను బయటకు తరిమేశారు. పోలింగ్ సిబ్బందిని బెదిరించి.. కుమ్మక్కు అయ్యి టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆరోపిస్తూ వీడియో రిలీజ్ చేసింది వైసీపీ.
ఓ పోలీస్ కానిస్టేబుల్ అక్కడే ఉన్నా.. ఇదేంటనీ ఓ వ్యక్తి ప్రశ్నిస్తున్నా అతను పట్టించుకోలేదు. టీడీపీ రిగ్గింగ్ చేస్తూ పట్టుబడిందంటూ వీడియోతో సహా ఎన్నికల అధికారులకు కంప్లయింట్ చేశారు వైసీపీ నేతలు. రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కంభంపాడులోని 218 పోలింగ్ బూత్ లో ఈ దారుణం జరిగింది. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ లో నుంచి బలవంతంగా బయటికి నెట్టి మరీ దౌర్జన్యంగా రిగ్గింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఓటర్లను కూడా భయభ్రాంతులకు గురిచేశారని అంటున్నారు గ్రామస్తులు. చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావు ఉన్నారు.