మొరాయించిన ఈవీఎం : పోలింగ్ సిబ్బందిపై కవిత అసహనం

  • Published By: madhu ,Published On : April 11, 2019 / 02:40 AM IST
మొరాయించిన ఈవీఎం : పోలింగ్ సిబ్బందిపై కవిత అసహనం

Updated On : April 11, 2019 / 2:40 AM IST

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేయడానికి ఉదయమే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రముఖులు సైతం ఓటు వేయడానికి ముందుకొచ్చారు. నిజామాబాద్ జిల్లాలో ఓటు వేయడానికి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత దంపతులు నవీపేట మండలంలోని పోతంగల్‌ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అందరిలాగానే క్యూ లైన్లలో నిలిచారు.

అయితే ఈవీఎంలు మొరాయించడంతో కవిత అసహనం వ్యక్తం చేశారు. ఓటు వేయడానికి కవిత దంపతులు వేయిట్ చేయాల్సి వచ్చింది. పోలింగ్ సిబ్బందిపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. మాక్ పోలింగ్ గంట ముందే నిర్వహిస్తారు..ఎందుకు పోలింగ్ ఆలస్యమైందని ప్రశ్నించారని సమాచారం. బ్యాలెట్ యూనిట్స్‌కు సీరియల్ నెంబర్స్ వేయలేదని తెలిపారు. ఓటు వేయడానికి వచ్చే వారు కన్ఫ్యూజన్ కారా ? ఇంత మంది అభ్యర్థులు ఉంటే ఏర్పాట్లు ఇలానే చేస్తారా ? అని ప్రశ్నించారు. 

జిల్లా చరిత్రలో తొలిసారిగా 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఇక్కడ. అధికారులు ఈ ఎన్నికను ఛాలెంజ్‌గా తీసుకుని ఏర్పాట్లు చేశారు. 27వేల బ్యాలెట్‌ యూనిట్లను పరిశీలించి సిద్ధం చేశారు. 1788 పోలింగ్‌ కేంద్రాల్లో 21,500 బ్యాలెట్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. పోలింగ్‌ విధుల్లో సుమారు 27వేల సిబ్బందితో పాటు బందోబస్తు కోసం 6వేల మంది పోలీసులను నియమించారు. ఎం -3 రకం ఈవీఎంలతో తొలిసారిగా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో అందరి దృష్టి నిజామాబాద్ జిల్లాపై నెలకొంది.