చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు కూడా రావు

  • Published By: veegamteam ,Published On : April 7, 2019 / 10:52 AM IST
చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే డిపాజిట్లు కూడా రావు

Updated On : April 7, 2019 / 10:52 AM IST

శ్రీకాకుళం : తాను చంద్రబాబులా మోసం చెయ్యనని, మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తానని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. హామీలన్నీ అమలు చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా అన్నారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇదే మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. వంశధార ప్రాజెక్ట్, భావనపాడు పోర్టు నిర్వాసితులకు తాను అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. రాజకీయాల్లో నిజాయితీ, విశ్వసనీయత ఉండాలన్నారు.

ప్రతి పేదవాడి గుండె చెప్పుడు వైసీపీ మేనిఫెస్టోలో పెట్టామన్నారు. భావనపాడు పోర్టులో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఏ కాంట్రాక్ట్ అయినా మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబానికే వెళుతుందని ఆరోపించారు. లంచం ఇవ్వనిదే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు పాలనపై చర్చ జరిగితే టీడీపీకి ఒక్క ఓటు కూడా పడదని జగన్ చెప్పారు. చంద్రబాబు పాలన అంతా మోసం, అబద్దాలే అని మండిపడ్డారు. కాకర్లపల్లి పవర్ ప్లాంట్ ను రద్దు చేస్తానని చెప్పి.. చంద్రబాబు మాట తప్పారని జగన్ అన్నారు. తిత్లీ తుఫాన్ తో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయ్యిందని వాపోయిన జగన్.. వైసీపీ అధికారంలోకి వస్తే తిత్లీ బాధితులను ఆదుకుంటామని వాగ్దానం చేశారు. ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం చిన్న పనులను కూడా చెయ్యలేదన్నారు. ఇసుక, మట్టి ఏదీ వదలకుండా టీడీపీ నేతలు దోచుకున్నారని జగన్ ఆరోపించారు.