విపత్తులోనూ సడలని వేగం : వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ

కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన వారికి పెన్షన్లను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో అందచేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజామునుంచే గ్రామ వాలంటీర్లు అర్హులైన వారికి పించన్లు అందచేస్తున్నారు. ఇంతటి విపత్తులోనూ గ్రామ వాలంటీర్లు అంకిత భావంతో తెల్లవారు జామునుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తిరుగుతూ పెన్షన్లు అందచేశారు.
ఉదయం 8:30 గంటలకు 53శాతం పెన్షన్లు పంపిణీ పూర్తయ్యింది. సుమారు 59 లక్షల పెన్షన్లలో 31 లక్షల పంపిణీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. వేలిముద్రల స్థానంలో ఫొటో గుర్తింపు ఆధారంగా పెన్షన్లు అందచేశారు.
కరోనా నేపథ్యంలో ఈ సారి బయోమెట్రిక్, సంతకం లేకుండానే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మూడు రోజుల ముందుగానే నిధులు కూడా విడుదల చేసింది. పెన్షన్లు పొందుతున్న వారిలో వృద్ధులు, వితంతువులు, చేనేతలు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నందున ఈ సారికి ఎవరు ఎక్కడ ఉన్నా పోర్టబులిటీ ద్వారా పింఛన్ డబ్బులను అందచేస్తున్నారు. సొంత ఊరిలోనే కాక…. తనకు వీలున్న ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటు కల్పించారు. పింఛనుదారుడు తాను ఉన్న ప్రాంతానికి చెందిన వలంటీరుకు వివరాలు తెలియజేస్తే చాలు ఇంటికే వచ్చి పెన్షన్ డబ్బులు అందచేస్తారు.