చలి చంపేస్తోంది..! దేశవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవత్ర, వణుకు పుట్టిస్తున్న ఐఎండీ హెచ్చరికలు..

రాబోయే రోజుల్లో చలి మరింత విజృంభించబోతున్నట్లు ఐఎండీ చేసిన హెచ్చరికలు గజగజ వణికిస్తున్నాయి.

చలి చంపేస్తోంది..! దేశవ్యాప్తంగా పెరుగుతున్న చలి తీవత్ర, వణుకు పుట్టిస్తున్న ఐఎండీ హెచ్చరికలు..

Harsh Winter (Photo Credit : Google)

Updated On : November 17, 2024 / 7:03 PM IST

Harsh Winter : దేశ వ్యాప్తంగా ప్రజలు చలి గాలులతో వణికిపోతున్నారు. దట్టమైన పొగ మంచుతో పాటు తీవ్రమైన చలిగాలులు వీస్తుండటంతో గజగజలాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది. రహదారులపై 10 మీటర్ల దూరంలో ఏముందో కనిపించడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే ఎముకల్లో వణుకు పుట్టే విధంగా పొగ మంచు కురుస్తోంది. ఇక శీతాకాలం ప్రారంభంలోనే చలిగాలులు ప్రజలను గజగజ వణికిస్తుంటే.. రాబోయే రోజుల్లో మరింత కఠినంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

లా నినా ఎఫెక్ట్ తో ఈ శీతాకాలంలో సాధారణం కంటే అధికంగా చలి తీవ్రత ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇక, ఉత్తర భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో టెంపరేచర్లు భారీగా తగ్గుముఖం పట్టబోతున్నాయని వెల్లడించింది. నార్త్ ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో ఉదయం పూట 30-32 డిగ్రీలు.. రాత్రి వేళ 14-19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఈ టెంపరేచర్లు మరింత క్షీణించనున్నాయి.

ఇప్పటికే వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రాబోయే రోజుల్లో చలి మరింత విజృంభించబోతున్నట్లు ఐఎండీ చేసిన హెచ్చరికలు గజగజ వణికిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు వచ్చే రెండు రోజుల తర్వాత క్రమంగా 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని ఐఎండీ చెప్పింది. ఇక, ఈ నెల చివరి నాటికి లా నినా ఎఫెక్ట్ తో చలి మరింత తీవ్రమయ్యే అవకాశముందంది ఐఎండీ.

అటు దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో విలవిలలాడుతోంది. వాయు నాణ్యత రోజురోజుకు దెబ్బతింటోంది. వరుసగా 5వ రోజు వాయు నాణ్యత సూచీ 428 గా నమోదైంది. మరోవైపు ఢిల్లీని పొగ మంచు కప్పేసింది. వాహనాలకు దారి కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇటు విమాన సర్వీసులపైనా ప్రభావం పడింది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు కప్పుకుంది.

800 మీటర్ల మేర దృశ్యాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో 107 విమానాలు ఆలస్యం అవగా, మరో 3 విమాన సర్వీసులు రద్దయ్యాయి. బవానాలో అత్యధికంగా 471, అశోక్ విహార్, జహంగీర్ పూర్ లో 466 గా వాయు నాణ్యత సూచీ రికార్డ్ అయ్యింది. ఢిల్లీలో కాలుష్య స్థాయి విపరీతంగా పెరుగుతూ ఉండటంతో ప్రజలు శ్వాస కోశ, కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Also Read : ఢిల్లీలో తీవ్ర గాలి కాలుష్యం.. స్కూళ్లల్లో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి.. ఆఫ్‌లైన్‌ విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ!