AP Rain Alert: ఏపీకి వరుణ గండం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..! 5రోజులు పిడుగుల హెచ్చరిక..
తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

AP Rain Alert: నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు తీరంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇక, రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఒక NDRF, నాలుగు SDRF బృందాలని ప్రభావిత జిల్లాలకు పంపించామన్నారు.
ఇక, బుధవారం సాయంత్రం 6 గంటల వరకు నెల్లూరు జిల్లా మర్రిపాడులో 89.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొగిలిచెర్లలో 79 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా భవదేవరపల్లిలో 75 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా ఉమారెడ్డి పల్లెలో 62.2 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో 61.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు.
బీ అలర్ట్.. అధికార యంత్రాంగానికి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని రాష్ట్రంలో పలు జిల్లాలకు హెచ్చరికలు వచ్చిన క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురవనున్న క్రమంలో రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలన్నారు.
రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలు చేపట్టే సహాయక చర్యలు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు పంచాయతీరాజ్ సిబ్బంది కూడా పాలుపంచుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో డ్రైనేజీలు, కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయిన పక్షంలో వాటిని తక్షణమే తొలగించాలని సూచించారు. ఆకస్మిక వరదల హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తన కార్యాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
Also Read: ఆ సీటుపై మెగా బ్రదర్ ఫోకస్..! వచ్చే ఎన్నికల్లో నాగబాబు పోటీ అక్కడి నుంచేనా?