SPY రెడ్డి ఇకలేరు : 2 రూపాయలకే భోజనం..రూపాయికే రొట్టే పప్పు

  • Published By: madhu ,Published On : May 1, 2019 / 12:53 AM IST
SPY రెడ్డి ఇకలేరు : 2 రూపాయలకే భోజనం..రూపాయికే రొట్టే పప్పు

నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసారు. ఎంపీగా, సామాజికవేత్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఎస్పీవై రెడ్డి మృతితో ఆయన కుటుంబీకులు, అభిమానులు శోఖసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా.. పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

రెండు రూపాయలకే భోజనం.. రూపాయికే పప్పు- రొట్టే.. నంద్యాలలో ఈ రెండు పథకాల పేర్లు వింటే టక్కున గుర్తొచ్చే పేరు ఎస్పీవై రెడ్డి. పారిశ్రామికవేత్తగా.. ఎంపీగా ప్రజలకు చేరువగా ఉన్నారు. ఈయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధుల కారణంగా ఏప్రిల్ 3వ తేదీన ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఎస్పీవై రెడ్డికి వెంటిలెటర్‌పై చికిత్స అందించారు. అయితే.. ఆరోగ్యం విషమించడంతో.. ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. రాజకీయవేత్తగానే కాకుండా… పారిశ్రామికవేత్తగా.. సామాజికవేత్తగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్పీవై రెడ్డి.

4 జూన్ 1950లో కడపలో జన్మించారు ఎస్పీవై రెడ్డి. ఆయన పూర్తి పేరు ఎస్. పెద్ది యెరికల్ రెడ్డి. వరంగల్ నిట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. ఆ తర్వాత ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో శాస్త్రవేత్తగా చేరారు. సైంటిఫిక్ ఆఫీసర్ హోదాలో పని చేస్తూ 1977లో బార్క్ నుంచి బయటకు వచ్చిన ఆయన… 1979లో ఒక ప్లాస్టిక్ కంటైనర్ల సంస్థను స్థాపించారు. 1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ రంగంలోకి దిగారు. అది ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది. 

పైపుల పరిశ్రమ సక్సెస్ కావడంతో… ఆయన తన ఆదాయంలో చాలావరకూ సేవా కార్యక్రమాలకు కేటాయించేవారు. నంద్యాల ప్రాంతంలో పేదల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు కేవలం రెండు రూపాయలే అన్నం పెట్టేవారు. ఆ తర్వతా ఒక్క రూపాయికే పప్పు- రొట్టె పథకాన్ని ప్రారంభించి.. పెద్ద ఎత్తున పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలతో నంద్యాల ప్రాంతంలో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.