Tariff Bomb: అమెరికా బాటలో మరో దేశం..! భారత్‌పై టారిఫ్స్ బాంబ్..!
దాదాపు 1400 వస్తువులపై సుంకాలు 50 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి.
Tarrif Bomb: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా బాటలోనే మరో దేశం కూడా వెళ్లింది. భారత్ పై టారిఫ్స్ బాంబ్ వేసింది. భారత్ సహా పలు దక్షిణాసియా దేశాలపై సుంకాలు విధించేందుకు మెక్సికో సిద్ధమైంది.
తమ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎంపిక చేసిన వస్తువులపై సుంకాలను భారీగా పెంచేందుకు మెక్సికో ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు అక్కడి సెనేట్ ఆమోదం తెలిపింది. చైనా, భారత్ సహా పలు ఆసియా దేశాలకు చెందిన దాదాపు 1400 వస్తువులపై సుంకాలు 50 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి. 2026 జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
చైనా, భారత్, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, ఇండోనేషియాతో సహా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం లేని ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్స్, విడిభాగాలు, టెక్స్‌టైల్స్, దుస్తులు, ప్లాస్టిక్, స్టీల్ తదితర వస్తువులపై సుంకాలు పెంచాలని మెక్సికో ప్రతిపాదించింది. దీన్ని ఆ దేశ ఆర్థికమంత్రి సెప్టెంబర్‌లోనే ప్రవేశపెట్టారు. చట్టసభలో అధికార పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ అప్పుడు సభ మద్దతు పొందలేకపోయింది. తాజాగా ఇందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
దేశీయ ఉత్పత్తి పెంచడం, చైనాతో వాణిజ్య సమతుల్యత సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధ్యక్షురాలు క్లాడియా షీన్ బామ్ తెలిపారు.
ఆమె అలా చెబుతున్నా.. దీని వెనుక మరో కోణం ఉందని అనలిస్టులు చెబుతున్నారు. అమెరికా- కెనడా- మెక్సికో వాణిజ్య ఒప్పందం చర్చలకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు మెక్సికో ఈ టారిఫ్స్ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. మెక్సికోకు.. అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. కొంత కాలంగా.. మెక్సికోపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మెక్సికోను ఉపయోగించుకొని చైనా బ్యాక్‌డోర్‌లో అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. మెక్సికో నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తానని.. అదనంగా పెనాల్టీ కూడా విధించనున్నట్లు హెచ్చరిస్తున్న క్రమంలో.. ట్రంప్ ను బుజ్జగించేందుకే క్లాడియా ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని విశ్లేషిస్తున్నారు.
Also Read: పుతిన్ భారత పర్యటన తర్వాత.. ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్.. కారణం అదేనా..
