Kamareddy: కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. కేసీఆర్ రాకతో రూట్ మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Kamareddy: కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

telangana assembly elections 2023 who is congress candidate in kamareddy

Kamareddy Congress Candidate: కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిపై క్లారిటీ రావడంలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ ఈ సారి కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేకపోవడంతో హస్తం పార్టీ మరో అభ్యర్థి వేటలో పడినట్లు తెలుస్తోంది. షబ్బీర్ అలీ కాదంటే.. ఈ స్థానం నుంచి ఎల్లారెడ్డి కాంగ్రెస్ నేత మదన్‌మోహన్ లేదా బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

ఉత్తర తెలంగాణలో కారు వేగాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ ఎంచుకున్న కామారెడ్డి నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. కేసీఆర్ రాకతో రూట్ మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో సీనియర్ లీడర్ అయిన షబ్బీర్ అలీ.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ గెలిస్తే ఈ సారి మంత్రి అయ్యే చాన్స్ ఉందని భావిస్తున్నారు. ఐతే కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండటం షబ్బీర్ అలీకి సవాల్‌గా మారింది. 2004లో కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన షబ్బీర్ అలీ ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఓడిపోయారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుంచి పోటీచేసినా పరాజయం తప్పలేదు.

ఇలా వరుసగా నాలుగు సార్లు ఓటమే ఎదురు కావడంతో ఈసారి ఎలాగైనా విజయమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కేసీఆర్పై కామారెడ్డి బరిలో దిగి రిస్క్ చేయడం కన్నా.. కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్ ఉన్న ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయాలని షబ్బీర్ అలీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలవడం.. ఇప్పుడు కూడా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయడమే సేఫ్ అనుకుంటున్నారట షబ్బీర్ అలీ. ఐతే ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ టికెట్ దక్కించుకోవడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు ఉన్నాయి.

ఎల్లారెడ్డిలో ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ నేతలు టికెట్ కోసం పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సీనియర్ నేత మదన్‌మోహన్రావు ఈ సారి ఎలాగైనా ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి తీరాలని ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో హస్తం గుర్తుపై గెలిచి బీఆర్‌ఎస్‌లోకి జంప్ చేసిన ఎమ్మెల్యే జాజుల సురేందర్‌ను ఓడించడమే తన టార్గెట్‌గా చెప్పుకుంటున్న మదన్‌మోహన్.. ఎల్లారెడ్డి టికెట్ రేసులో ముందున్నారు. ఆయనకు కాంగ్రెస్ అధిష్టానంతోనూ, రాహుల్తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మరో నేత సుభాష్ రెడ్డి సైతం టికెట్‌పై ధీమా కనబరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో షబ్బీర్ అలీకి ఎల్లారెడ్డి టికెట్ లభిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా?

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై షబ్బీర్ అలీయే సరైన అభ్యర్థని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. షబ్బీర్ అలీ కూడా కేసీఆర్ ను ఓడిస్తానంటూ మొదట్లో ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం షబ్బీర్ ఆలోచనలు వేరేగా ఉండటంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం వెతుకుతోంది. సీఎంపై షబ్బీర్ అలీనే నిలపడమా.. లేదంటే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకుని ఆయన్ను కేసీఆర్‌పై నిలపడమా అన్నది కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఎల్లారెడ్డి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లారు. బీజేపీలో ఆయన ఇమడలేకపోవడంతో కాంగ్రెస్‌లోకి రమ్మంటూ ఆహ్వానం పంపింది కాంగ్రెస్ హైకమాండ్.

Also Read: కవితకు ఆ ఇద్దరి బాధ్యతలే ఎందుకు అప్పగించారు.. ఆ ఇద్దరు నేతలు ఎవరు?

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ముఖ్యనేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మాజీ మంత్రి మండవ నివాసంలో ఏనుగు రవీందర్‌రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కావడంతో ఆయన పార్టీలో చేరిక లాంఛనమే అనే టాక్ నడుస్తోంది. ఐతే ఏనుగు రవీందర్‌రెడ్డి ఎల్లారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కానీ, అక్కడ ఇప్పటికే ఇద్దరు నేతలు పోటీ పడుతుండటం.. ఇప్పుడు కొత్తగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా ఎల్లారెడ్డి వైపే చూస్తుండటంతో పోటీ మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఏనుగు రవీందర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నా.. ఆయనకు ఎల్లారెడ్డి టిక్కెట్ ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు. దీంతో కుదిరితే కామారెడ్డి లేదంటే బాన్సువాడ టికెట్ ఇస్తామనే ప్రతిపాదనను ఏనుగు రవీందర్‌రెడ్డి ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ఐతే కామారెడ్డి నుంచి షబ్బీర్ పోటీచేయరనే ప్రచారం నిజం కాదంటున్నారు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్. షబ్బీర్ వెనకడుగు వేస్తున్నట్లు జరుగుతున్నది దుష్ప్రచారమని ఆయన కొట్టిపడేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ పోటీ చేస్తారని అంటున్నారు డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు.

Also Read: తెలంగాణలో పోటీపై అయోమయం.. తెలుగు తమ్ముళ్లలో కనిపించని జోష్!

ఉత్తర తెలంగాణలో కీలకమైన నిజామాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు చెందిన నలుగురు నేతల మధ్య జరుగుతున్న ఈ కుర్చీలాటలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదే ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టే నేత ఎవరన్న సస్పెన్స్ ఎప్పుడు తొలగుతుంతోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇన్నాళ్లు షబ్బీర్ అలీయే సీఎంపై పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ.. షబ్బీర్ వెనక్కి తగ్గడం కాంగ్రెస్‌లో విస్తృత చర్చకు దారితీస్తోంది.. సీఎంపై పోటీకి షబ్బీర్ సముఖంగా ఉంటే తొలి జాబితాలోనే ఆయన పేరు ప్రకటించేవారని ఆయన వెనకడుగు వేయడం వల్లే కామారెడ్డి అభ్యర్థి ప్రకటన పెండింగ్‌లో పడిపోయిందని తెలుస్తోంది. కనీసం మలిజాబితాలోపైనా దీనిపై క్లారిటీ వస్తుందో, లేదో చూడాల్సివుంది.