Rohit Sharma : ఇంగ్లాండ్‌తో మ్యాచ్ రోహిత్ శ‌ర్మ‌కు ఎంతో ప్ర‌త్యేకం.. ఎందుకో తెలుసా..?

టీమ్ఇండియా ఆదివారం ఇంగ్లాండ్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. రోహిత్ శ‌ర్మ‌కు ఈ మ్యాచ్ ఎంతో ప్ర‌త్యేకంగా నిల‌వ‌నుంది.

Rohit Sharma : ఇంగ్లాండ్‌తో మ్యాచ్ రోహిత్ శ‌ర్మ‌కు ఎంతో ప్ర‌త్యేకం.. ఎందుకో తెలుసా..?

Rohit Sharma

Rohit Sharma records : స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో విజ‌యాలు సాధించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఓట‌మి ఎర‌గ‌ని జ‌ట్టుగా నిలిచింది. ఈ క్ర‌మంలో ఆదివారం ఇంగ్లాండ్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. ఇంగ్లాండ్‌పైనా గెలిచి డబుల్ హ్యాట్రిక్ విజ‌యాల‌తో పాటు సెమీస్ అవ‌కాశ‌ల‌ను మ‌రింత మెరుగుప‌ర‌చుకోవాల‌ని రోహిత్ సేన ప‌ట్టుద‌లగా ఉంది. ఇప్ప‌టికే ల‌క్నోకు చేరుకున్న భార‌త ఆట‌గాళ్లు ప్రాక్టీస్ మొద‌లెట్టారు.

కెప్టెన్‌గా వందో మ్యాచ్‌..

కెప్టెన్‌గానే కాకుండా బ్యాట‌ర్‌గానూ రోహిత్ శ‌ర్మ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరంభంలో వేగంగా ప‌రుగులు సాధిస్తూ ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను ఒత్తిడిలోకి నెడుతున్నాడు. కాగా.. ఆదివారం ఇంగ్లాండ్‌తో జ‌రగ‌బోయే మ్యాచ్‌ రోహిత్ శ‌ర్మ‌కు ఎంతో ప్ర‌త్యేకంగా నిల‌వ‌నుంది. కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది వందో మ్యాచ్ కావ‌డం విశేషం. ఈ మ్యాచ్ ద్వారా టీమ్ఇండియాకు వంద మ్యాచుల్లో నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ఏడో సార‌థిగా హిట్‌మ్యాన్ రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు.

Also Read : టీమ్ఇండియా విజ‌యావ‌కాశాల‌పై ధోనీ కామెంట్స్ వైర‌ల్‌..

ఇప్ప‌టి వ‌ర‌కు రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలో టీమ్ఇండియా 99 మ్యాచులు ఆడింది. ఇందులో 73 మ్యాచుల్లో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించింది. అత‌డి గెలుపు శాతం 73.73. మ‌హేంద్ర సింగ్ ధోని అత్యధికంగా 332 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

మ‌రో 47 ప‌రుగులు చేస్తే..

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ 47 ప‌రుగులు చేస్తే గ‌నుక అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 18000 ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన 20వ క్రికెట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు. 2007లో అరంగేట్రం చేసిన రోహిత్ ఇప్ప‌టి వ‌ర‌కు 17,953 అంతర్జాతీయ పరుగులు చేశాడు. ఇందులో 45 సెంచరీలు, 98 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వ‌న్డేల్లో మూడు ద్విశ‌త‌కాలు బాదిన ఏకైక క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ‌నే. వ‌న్డేల్లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరు (264) రికార్డు రోహిత్ పేరిటే ఉంది.

Also Read: లైటింగ్ షో.. అభిమానులకు అనుభూతి.. క్రికెటర్లకు భయానక అనుభవం