ఒంగోలు ఎంపీ బరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..! కారణం అదేనా? జగన్ వ్యూహం ఏంటి?

ఒకరకంగా ఆయన ఆంజనేయుడి లాంటివాడు. జగన్‌ చూసి రమ్మంటే.. చేసిరాగల నేర్పరి చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఎక్కడా బయటపడరు.., హడావిడి చేయరు.. పనిమాత్రం చక్కబెట్టగలరని.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి పనితీరు గురించి బాగా తెలిసినవారు చెబుతుంటారు...

ఒంగోలు ఎంపీ బరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..! కారణం అదేనా? జగన్ వ్యూహం ఏంటి?

Why CM Jagan Choose Chevireddy Bhaskar Reddy

Chevireddy Bhaskar Reddy : ఒంగోలు వైసీపీ రాజకీయం… ఇక నుంచి ముఖ్యమంత్రి జగన్‌కు నమ్మినబంటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేతుల్లోకి వెళ్లనుంది. తన సిట్టింగ్‌ స్థానం ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి తన కుమారుడికి టికెట్‌ ఇప్పించుకోగలిగిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి.. ఊహించని రీతిలో ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కనుంది. ఏ మాత్రం చడీచప్పుడు చేయకుండా, అవకాశం లభిస్తే చటుక్కున అల్లుకుపోయే వ్యవహారశైలి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సొంతం.

ఒకరకంగా ఆంజనేయుడి లాంటివాడు..
సీఎం జగన్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తుల్లో ఒకరు. ఒకరకంగా ఆయన ఆంజనేయుడి లాంటివాడు. జగన్‌ చూసి రమ్మంటే.. చేసిరాగల నేర్పరి చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఎక్కడా బయటపడరు.., హడావిడి చేయరు.. పనిమాత్రం చక్కబెట్టగలరని.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి పనితీరు గురించి బాగా తెలిసినవారు చెబుతుంటారు.. ఎంపీగా గెలిచి ఢిల్లీకి వెళ్లగలిగితే.. అక్కడ కూడా సీఎం జగన్‌ తరఫున విజయవంతంగా పనులు చక్కబెట్టగలరని సామర్థ్యం చెవిరెడ్డిది.. ఇలాంటి నేతకు ఒంగోలు ఎంపీగా చక్రం తిప్పే అవకాశం లభించడం.. ఆ జిల్లా రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.

జగన్ ఆదేశాలతో పోటీకి సంసిద్ధత..
ఏపీ రాజకీయాల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారిపోయారు. తన కుమారుడికి టిక్కెట్టు దక్కించుకోవడమే కాకుండా, ఇప్పుడు ఒంగోలు ఎంపీ బరిలోనూ నిలిచే అవకాశం పొందనున్నారు చెవిరెడ్డి. గత కొన్నేళ్లుగా సీఎం వైఎస్ జగన్‌తో సన్నిహితంగా మెలుగుతూ, చేదోడువాదోడుగా ఉంటున్న చెవిరెడ్డికి ఒంగోలు ఎంపీ బరిలో దింపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ ఆదేశాలతో చెవిరెడ్డి కూడా పోటీకి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాంటి క్లిష్టస్థితిలోనైనా నెట్టుకొచ్చే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇప్పుడు ఒంగోలులో కొత్త సవాల్ ఎదురుకాబోతోంది.

అలా సీఎం జగన్ దృష్టిలో పడిన చెవిరెడ్డి..
సీఎం జగన్‌కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నమ్మిన బంటు. సీఎం కుటుంబ సభ్యులతోనూ చెవిరెడ్డికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అనుంగు శిష్యుడైన చెవిరెడ్డి, వైఎస్‌ మరణం తర్వాత జగన్‌కు చేరువయ్యారు. చంద్రగిరిని తన అడ్డాగా మార్చుకున్నారు. సీనియర్‌ నేత గల్లా అరుణకుమారిని ఓడించడం ద్వారా చెవిరెడ్డి సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. 2014లో తొలిసారి చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అప్పటి ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. 2014-19 మధ్య చెవిరెడ్డిపై లెక్కకు మిక్కిలిగా పోలీసు కేసులు నమోదయ్యాయంటే.. ఆయన ఏ స్థాయిలో టార్గెట్‌ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.

జగన్‌ను ఆకర్షించిన అంశం ఇదే..
ఇక చంద్రగిరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక సీఎం జగన్‌కు మరింత దగ్గరయ్యారు చెవిరెడ్డి. ఒక దశలో మంత్రివర్గంలో స్థానం ఆశించిన చెవిరెడ్డి.. సీఎం కుదరదని చెప్పడంతో సంతోషంగా రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చెవిరెడ్డిని ఒకటికి నాలుగు పదవులు వరించాయి. చంద్రగిరి ఎమ్మెల్యేతో పాటు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, టిటిడి పాలకమండలి సభ్యత్వం.. ఇలా నాలుగు ఉన్నత పదవులు ఒక్క చెవిరెడ్డికే లభించాయి. అయితే ఎన్ని పదవులు ఉన్నా హడావుడి లేకుండా తన పని తాను చేసుకోవడం చెవిరెడ్డి నైజం. సరిగ్గా సీఎం వైఎస్ జగన్‌ను ఆకర్షించిన అంశమూ ఇదే.. చంద్రగిరిలో కంఫర్ట్‌గా ఉన్న చెవిరెడ్డి.. ఇదే అదునుగా భావించి వారసుడు మోహిత్ రెడ్డిని చంద్రగిరి బరిలో నిలిపారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే తన కుమారుడికి ఏడాదిన్నర ముందే టికెట్ కన్ఫార్మ్ చేసుకోవడం చెవిరెడ్డితోనే మొదలయ్యింది. సీఎం జగన్ వద్ద చెవిరెడ్డికి అంతటి చనువు ఉంది.

Also Read : 70ఏళ్ల రాజకీయానికి ఫుల్‌స్టాప్‌.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలకు గల్లా కుటుంబం దూరం

వైసీపీకి.. ట్రబుల్ షూటర్‌గా మారిపోయారు..
కుమారుడిని అభ్యర్థిగా ప్రకటించాక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూర్తిగా ముఖ్యమంత్రి కార్యాలయానికే పరిమితమయ్యారు. వారంలో ఒకటి రెండు రోజులు మినహా మిగిలిన రోజులు తాడేపల్లిలోనే ఉంటున్నారు. ముఖ్యమంత్రికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొన్ని సర్వే బృందాలకు చెవిరెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. క్లిష్టమైన పార్టీ పనులు చక్కబడుతున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైసీపీకి ఓ ట్రబుల్ షూటర్‌గా మారిపోయారు. తెరవెనుక ఎన్నో కార్యక్రమాలను చక్కబెట్టే చెవిరెడ్డి… రెండో కంటికి కనిపించకుండా తనకు అప్పగించిన పని పూర్తి చేయడం విశేషంగా చెప్పొచ్చు. మీడియాలో కూడా పెద్దగా కనిపించని చెవిరెడ్డి.. చంద్రగిరిలో స్ట్రాంగ్‌ లీడర్‌గా ముద్రవేశారు. అదే ఆయన బలం.. ఇప్పుడు ఒంగోలు లోక్‌సభకు పోటీకి దింపడం వెనుక చెవిరెడ్డి నాయకత్వపటిమే కారణమని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు.

Also Read : ఫిబ్రవరి మొదటి వారంలో టీడీపీ-జనసేన మొదటి జాబితా!

అందుకే.. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి..!
ప్రస్తుతం ఒంగోలు లోక్‌సభ ఇన్‌చార్జి నియామకం వైసీపీకి సవాల్‌గా మారింది. ప్రస్తుతం ఎంపీ మాగుంట శ్రీనివాసులును కొనసాగించే చాన్స్‌ లేకపోవడంతో సమర్థ నేతలను అన్వేషించింది వైసీపీ హైకమాండ్‌. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు సీఎం జగన్‌ బాబాయి వైవీ సుబ్బారెడ్డి వంటి ముఖ్యనేతలు ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ సీటు గెలవడం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అంతేకాకుండా పార్టీ పట్టు సడలకుండా ఉండాలంటే చెవిరెడ్డి వంటి లీడరే బెటర్‌ అనుకున్న నిర్ణయానికి దారితీసింది. ఈ కారణంతోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ బరిలో నిలపాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా మంచి మార్కులు పొందిన చెవిరెడ్డి.. ఎంపీగా ఎన్నికైతే ఢిల్లీ వ్యవహారాలను చక్కబెట్టగలరని భావిస్తున్నారు సీఎం.

Also Read : భార్యభర్తల మధ్యే ఆధిపత్య పోరాటం.. టెక్కలి వైసీపీలో గ్రూప్‌ వార్‌