AP Politics: ఏపీలో రెబల్‌ ఎమ్మెల్యేల కథ క్లైమాక్స్‌కు..

స్పీకర్‌ నోటీసులకు టీడీపీ రెబల్స్‌ కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్‌, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌ ఇంతవరకు స్పందించలేదు.

AP Politics: ఏపీలో రెబల్‌ ఎమ్మెల్యేల కథ క్లైమాక్స్‌కు..

AP Rebel MLAs Issue

ఏపీలో రెబల్‌ ఎమ్మెల్యేల కథ క్లైమాక్స్‌కు చేరింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఏ నిర్ణయం తీసుకుంటారా? అధికార, ప్రతిపక్షాలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేపై వేటేస్తారా? లేక ఒక వర్గం వారిపై చర్యలు తీసుకుని వదిలేస్తారా? స్పీకర్ ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి? స్పీకర్‌ తీసుకోబోయే నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను ఏ మేర ప్రభావితం చేయబోతోంది.

రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ ఫైనల్‌ డెసిషన్‌ తీసుకోనున్నారా? రాజ్యసభ ఎన్నికల వేళ.. వైసీపీ వ్యూహం ఏంటి? ఏపీ రాజకీయాలను కాకరేపుతున్నారు రెబల్‌ ఎమ్మెల్యేలు. రాజ్యసభ ఎన్నికల ముందు వైసీపీలో రెబల్స్‌పై వేటు వేయాలని చురుగ్గా పావులు కదుపుతోంది ఆ పార్టీ హైకమాండ్‌.

దీనికి తగ్గట్టే టీడీపీ కూడా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలకు పట్టుబడుతుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైసీపీ రెబల్స్‌ను ఓ సారి విచారించిన స్పీకర్‌… మరోసారి విచారణకు రమ్మంటూ వాయిదావేశారు. పన్నెండో తేదీ సోమవారం వైసీపీ రెబల్స్‌తోపాటు టీడీపీ రెబల్స్‌ను విచారణకు రమ్మంటూ నోటీసులు జారీ చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం…

రాజ్యసభ ఎన్నికల వేళ..
రాజ్యసభ ఎన్నికల వేళ.. రెబల్స్‌పై విచారణ హీట్‌ పుట్టిస్తోంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ చేయడంతో అధికార వైసీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ నలుగురిపై వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది వైసీపీ… ఇదే సమయంలో తమ పార్టీ తరఫున గెలిచి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలపైనా చర్యలు తీసుకోవాలని టీడీపీ కూడా ఫిర్యాదు చేసింది. ఇరువైపులా చెరో నలుగురు ఎమ్మెల్యేలు చొప్పున మొత్తం 8 మందిపై విచారణ చేపట్టారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.

స్పీకర్‌ నోటీసులకు టీడీపీ రెబల్స్‌ కరణం బలరాం, వల్లభనేని వంశీమోహన్‌, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌ ఇంతవరకు స్పందించలేదు. రకరకాల కారణాలు చూపి స్పీకర్‌ విచారణకు వెళ్లలేదు ఈ నలుగురు ఎమ్మెల్యేలు. ఇదే సమయంలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు అయిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఒకసారి స్పీకర్‌ ఎదుట హాజరయ్యారు.

ఈ నెల 8న మరోసారి విచారణకు రమ్మని స్పీకర్‌ వాయిదా వేయగా, ఆ రోజు ఆనం ఒక్కరే విచారణకు వెళ్లారు. మిగిలిన ముగ్గురూ అనారోగ్యం కారణాలతో మినహాయింపు కోరారు. ఇప్పుడు మరోసారి మొత్తం 8 మంది హాజరుకావాల్సివుండగా, అంతా విచారణకు వెళ్తారా? లేదా? అన్నదే చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ వ్యూహం
ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అధికార వైసీపీకి ఉన్న బలంతో మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. కానీ, ఆ పార్టీ ఇటీవల చేసిన మార్పులతో కొంతమేర అసంతృప్తి చెలరేగుతోంది. వీరిని కట్టడి చేయాలంటే.. ఇప్పటికే పార్టీ ధిక్కారానికి పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వ్యూహం రచిస్తోంది వైసీపీ.

నలుగురిపై వేటు వేస్తే మిగిలిన వారంతా పార్టీ లైన్‌ ఉంటారనేది వైసీపీ వ్యూహం. అదేసమయంలో ప్రతిపక్షానికి నాలుగు ఓట్లు తగ్గించడమూ ఇందులో ఓ భాగమే.. మరి అధికార పక్షం కోరుకున్నట్లు స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారా? ఒక్క వైసీపీ రెబల్స్‌పైనే వేటు వేసి టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలను వదిలేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరో పదిహేను రోజుల్లో రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ జరుగుతుందనగా, స్పీకర్‌ విచారణకు పిలవడంతో ఇప్పుడు అందరి దృష్టి స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై పడింది. ఆయన తీసుకోబోయే నిర్ణయం రాజకీయ సంచలనాలకు తెరతీస్తుందా? లేక వాయిదా వేసి టీ కప్పులో తుఫాన్‌లా వ్యవహారాన్ని క్లోజ్‌ చేస్తారా? అనేది చూడాల్సివుంది. మొత్తానికి సోమవారం ఏపీ రాజకీయాల్లో ఓ సెన్సేషన్‌ డేగా మిగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు.

 

Raj Gopal Reddy: నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది వీరిద్దరే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి