ఎన్నికల వేళ గులాబీ శ్రేణులను డిఫెన్స్‌లో పడేస్తున్న కవిత అరెస్టు పరిణామం

Lok Sabha elections 2024: రెండేళ్లుగా జరుగుతున్న ఈ ప్రక్రియ రాజకీయంగా బీఆర్ఎస్‌ను ఓ దశలో ఆత్మ రక్షణలోకి నెట్టింది.

ఎన్నికల వేళ గులాబీ శ్రేణులను డిఫెన్స్‌లో పడేస్తున్న కవిత అరెస్టు పరిణామం

BRS

దాదాపు రెండేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ వివాదం ఇప్పుడు కవిత మెడకు చుట్టుకుంది. మాజీ సీఎం తనయగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నా…. పార్లమెంట్ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న కవిత అరెస్టు పరిణామం గులాబీ శ్రేణులను డిఫెన్స్‌లో పడేస్తోంది.

రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ.. తాము అమలు చేసిన మద్యం పాలసీని ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసేలా కవిత చక్రం తిప్పారని రెండేళ్ల క్రితం ఆరోపణలు వచ్చాయి. సౌత్ లిక్కర్ టీమ్‌కు కవిత నాయకత్వం వహించి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు కవితను విచారించేందుకు సిద్ధమయ్యాయి. ముందుగా లిక్కర్ స్కామ్‌లో కవితను సాక్షిగా పరిగణిస్తామని చెప్పిన కేంద్ర దర్యాప్తు సంస్థలు అదేవిధంగా విచారణ జరిపాయి.

హైదరాబాద్‌లోని తన నివాసంలోనే తొలిసారి కవిత ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఢిల్లీలో మూడు రోజులపాటు కవితను ఈడీ విచారించింది. లిక్కర్ పాలసీ విషయంలో కవిత పాత్రపై ఆరా తీస్తూ వచ్చింది. కేసులో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట రాఘవ, దినేష్ ఆరోరా, గోరుంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళైలు ఒక్కొక్కరు అప్రూవర్లుగా మారిపోయారు.

నోటీసులు ఇస్తూ..
ఈడీ కవితకు అప్పుడప్పుడు నోటీసులు ఇస్తూ వచ్చింది. అయితే ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మహిళగా తనకున్న హక్కులను కాపాడాలని కోరింది. విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది కవిత. దాదాపు ఆరు నెలలుగా సైలెంట్‌గా ఉన్న ఈడీ గత నెలలో మరోసారి లిక్కర్ పాలసీ కేసును తెచ్చి కవితను విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరుకాలేనని కేంద్ర దర్యాప్తు సంస్థలకు కవిత స్పష్టమైన సమాచారం ఇచ్చారు. సుప్రీం కోర్టులో దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణకు పిలవడాన్ని కవిత న్యాయవాదుల బృందం తప్పు పట్టింది. కానీ అనూహ్యంగా ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకుని…. కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు.

బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టి..
కవితపై లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆరోపణలు రావడం బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టింది. దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న ఈ ప్రక్రియ రాజకీయంగా బీఆర్ఎస్‌ను ఓ దశలో ఆత్మ రక్షణలోకి నెట్టింది. ఇది రాజకీయంగా తమపై చేస్తున్న కుట్ర అంటూ బీఆర్ఎస్ .. బీజేపీపై ఎదురు దాడికి దిగింది. ఇదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీలు ఒకటే అన్న విమర్శలను కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది. మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న ఈ వ్యవహారం రాజకీయంగా మరింత దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.

అందుకే కవిత అరెస్ట్.. బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా: అద్దంకి దయాకర్