దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

రైతు రుణమాఫీపై దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదని, ఆయనకు ఆగస్టులో రాజకీయంగా పెను ప్రమాదం ఉండబోతుందని డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.

దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Dr K laxman: లోక్‌స‌భ‌ ఎన్నికల్లో తమ పార్టీ 370, ఎన్డీఏ కూటమి 400 పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని సీట్లలోనూ బీజేపీ దూసుకుపోతుందన్నారు. ఎక్కువ సీట్లు సాధించబోతున్న ఏకైక పార్టీ బీజేపీ కాబోతుందని జోస్యం చెప్పారు. ఏకపక్షంగా ఇతర పార్టీలని కాదని ఓటర్లు నరేంద్ర మోదీ వైపు మొగ్గు చూపారని, ఆయనపై నమ్మకంతో ఓటు వేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.

రైతు రుణమాఫీపై దేవుళ్ళందరిపై ఒట్టు పెట్టినా సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మలేదని డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ”గతంలో కేసీఆర్ అప్పుచేసి పప్పుకూడు తినేలా చేస్తే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాగే చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి సంక్షోభంలోకి వెళ్లబోతోంది. కాళేశ్వరంపై ఇప్పటివరకు విచారణ ముందుకు వెళ్లలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి జాకీ పెట్టినా లేసే పరిస్థితి లేదు. ఆ పార్టీ కనీసం ఒక్క సీటు గెలుచుకునే పరిస్థితి లేదు, డిపాజిట్లు కూడా దక్కవు.

Also Read: తెలంగాణ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం.. ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం?

తెలంగాణలో బీజేపీ పార్టీ గట్టి శక్తిగా ఎదగబోతుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయం. రైతు రుణమాఫీపై దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డికి.. ఆగస్టులో రాజకీయంగా పెను ప్రమాదం ఉండబోతుంది. అగ్రవర్ణ ప్రజలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా బీజేపీని గుర్తించి ప్రజలు ఓట్లేశారు. రానున్న రోజుల్లో దేశం మొత్తం కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతుంద”ని డాక్టర్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు.

Also Read: కాంగ్రెస్‌ విజయాన్ని అడ్డుకునేందుకు బీఅర్ఎస్, బీజేపీ చేతులు కలిపాయి : జీవన్ రెడ్డి