Director Shankar : డైరెక్టర్ శంకర్‌కి ఏమైంది? శంకర్ సినిమాల్లో మ్యాజిక్ మిస్ అవ్వడానికి కారణాలేంటి?

స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు రాజమౌళి అందుకుంటున్న జేజేలు శంకర్ తన సినిమాలతో ఎప్పుడో అందుకున్నాడు.

Director Shankar : డైరెక్టర్ శంకర్‌కి ఏమైంది? శంకర్ సినిమాల్లో మ్యాజిక్ మిస్ అవ్వడానికి కారణాలేంటి?

Director Shankar Special Story after Bharateeyudu 2 why his Movies failed at Box Office in Recent Times

Director Shankar : డైరెక్టర్ శంకర్.. మణిరరత్నం తర్వాత తెలుగు వాళ్లకు తమిళ సినిమాపై ఆసక్తి కలిగించిన దర్శకుడు. తమిళ సినిమాని కమర్షియల్ గా పైకి లేపిన డైరెక్టర్. ఎంతోమంది 80s, 90s కిడ్స్ కి స్టార్ డైరెక్టర్. స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు రాజమౌళి అందుకుంటున్న జేజేలు శంకర్ తన సినిమాలతో ఎప్పుడో అందుకున్నాడు. కానీ ఇదంతా గతం. తాజాగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో శంకర్ మరోసారి చర్చగా మారారు. ఇప్పుడు శంకర్ కి ఏమైంది? శంకర్ సినిమాలు మిస్ ఫైర్ ఎందుకవుతున్నాయి అని అందరి మదిలో ఒకటే ఆలోచన.

1993లో జెంటిల్ మెన్ సినిమాతో దర్శకుడిగా మారిన శంకర్ మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకేఒక్కడు, బాయ్స్, అపరిచితుడు, శివాజీ, రోబో.. ఇలా ఒకదానికి మించి ఒకటి పెద్ద హిట్ అయ్యాయి. ఇవన్నీ కమర్షియల్ గా భారీ సక్సెస్ అయ్యాయి. ఇవన్నీ తమిళ్ సినిమాలే అయినా తెలుగులో కూడా రిలీజయి, ఇక్కడ కూడా పెద్ద హిట్ అయి తమిళ్ హీరోలని, శంకర్ ని, ఏఆర్ రహమాన్ ని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసాయి.

శంకర్ సినిమాల్లో ఒక మెసేజ్ ఉంటుంది. శంకర్ సినిమాల్లో ఎమోషన్ కరెక్ట్ గా పండి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. శంకర్ సినిమాల్లో గ్రాండ్ విజువల్స్ ఉంటాయి, భారీ ఖర్చుతో కూడిన అద్భుతమైన పాటలు ఉంటాయి. వీటన్నిటికీ మించి సాధారణ ప్రజల తాలూకు ఆలోచనలు ఆయన సినిమాల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాయి. శంకర్ కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ తో హిట్ అయిన చివరి సినిమా అంటే రోబోనే. ఆ తర్వాత రోబో 2 కూడా కమర్షియల్ గా హిట్ అయినా టాక్ మాత్రం మిక్స్‌డ్ గానే వచ్చింది.

ఇండియన్ 2కి మిక్స్‌డ్ టాక్
శంకర్ తన సినిమా కాకుండా మొదటిసారి స్నేహితుడు సినిమాతో ఓ బయట సినిమాని రీమేక్ చేసాడు. హిందీలో వచ్చిన 3 ఇడియట్స్ సినిమాని రీమేక్ చేసాడు. శంకర్ కి ఉన్న నాలెడ్జ్, క్రియేటివ్ లెవల్స్ కి రీమేక్ చేయాల్సిన పని లేదు. కానీ ఎందుకు చేసాడో ఆయనకే తెలియాలి. ఆ రీమేక్ నుంచే శంకర్ సినిమాలు నిరాశపరుస్తున్నాయి. ఆ రీమేక్ మొదటిసారి శంకర్ కి ఫ్లాప్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత విక్రమ్ తో ‘ఐ’ అనే ప్రయోగాత్మక సినిమా తీసాడు. అది కూడా చూడటానికి గ్రాండ్ గా కనిపించినా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత రోబో 2 కమర్షియల్ గా సక్సెస్ అయినా మిక్స్‌డ్ టాక్ వచ్చి శంకర్ మ్యాజిక్ మాత్రం మిస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇండియన్ 2 సినిమాకి కూడా మిక్స్‌డ్ టాక్ వస్తుంది. కలెక్షన్స్ పరంగా కూడా అంత పాజిటివ్ టాక్ వినిపించట్లేదు.

ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలు అందించిన శంకర్ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడంటే చాలానే కారణాలు చెప్పొచ్చు. మొదట కథ.. అతని గత సినిమాల కథల్లో ఒక సహజత్వం ఉండేది, జనాల్లోంచి కథల్ని తీసుకొని సమస్యల్ని చూపెట్టేవాడు. కానీ శివాజీ తర్వాత వచ్చిన సినిమాల్లో సమస్యలు చూపెట్టినా అవి సినిమాటిక్ గానే ఉంటున్నాయి. నార్మల్ ఆడియన్స్ వాటికి కనెక్ట్ అవ్వట్లేదు. అతని గత సినిమాల్లో ఎమోషన్ చాలా బాగా పండేది. రోబో నుంచి సినిమాల్లో ఎమోషన్ ఉన్నా వర్కౌట్ అవ్వట్లేదు.

ప్రస్తుతం శంకర్ విషయంలో అందరూ ఒకరి గురించి మాట్లాడుకుంటున్నారు. శంకర్ సినిమాలకు రైటింగ్ లో సుజాత అనే స్టార్ రైటర్ సపోర్ట్ గా ఉండేవాడు. శంకర్ సినిమాలకు డైలాగ్స్, స్క్రీన్ ప్లేలో సుజాత భాగమే ఎక్కువగా ఉండేది. అయితే ఇతను 2008లో చనిపోయాడు. ఆ తర్వాత నుంచే శంకర్ సినిమాల్లో డైలాగ్స్, ఎమోషన్ సరిగ్గా పండట్లేదు అని, రైటర్ సుజాత లేకపోవడం వల్లే శంకర్ ఫెయిల్ అవుతున్నాడు అని కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ఏఆర్ రహమాన్‌ని పక్కనపెట్టి..
ఇక వీటితో పాటు శంకర్ సినిమాల్లో పాటలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో అంత వినడానికి, చూడటానికి బాగుంటాయి. దీనికి ఏఆర్ రహమాన్ కూడా ఒక కారణం. శంకర్ సినిమాల్లో స్నేహితుడు, అపరిచితుడు, ఇప్పుడు వచ్చిన ఇండియన్ 2 తప్ప అన్ని సినిమాలకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకుడు. ఏఆర్ రహమాన్ లో కూడా ఒకప్పటి మ్యాజిక్ మిస్ అవ్వడం, ఇప్పుడు శంకర్ సినిమాల్లో పాటలు పెద్దగా హిట్ అవ్వకపోవడం కూడా శంకర్ కి మైనస్ అవుతుంది. భారతీయుడు 2 సినిమాకి మ్యూజిక్ చాలా పెద్ద మైనస్. ఏఆర్ రహమాన్ ని పక్కనపెట్టి అనిరుద్ తో కొట్టించాడు. సినిమాల్లో మ్యూజిక్, పాటలు మైనస్ అవ్వడం కూడా సినిమాల ఫెయిల్యూర్ కి ఒకరకంగా కారణమే అని అందరికి తెలుసు.

ఇక గ్రాండ్ సాంగ్స్ విజువల్స్ చూపిస్తున్నా అందులో రియాలిటీకి దగ్గరగా ఉండట్లేదు. ఖర్చు ఎక్కువ అనే తెరపై కనిపిస్తుంది కానీ ఆ పాట విజువల్స్ ప్రేక్షకులని మెప్పించట్లేదు. శంకర్ జీన్స్ సినిమాలో ఓ పాటలో ప్రపంచంలోని అన్ని వింతల్ని చూపిస్తాడు, ఇంకో సాంగ్ లో ఎక్కడెక్కడో కొత్త లొకేషన్స్ అన్ని చూపిస్తాడు. అంత ఖర్చుపెట్టి అక్కడికి వెళ్లి అవి చూపిస్తే నిజంగానే మనం వెళ్లి చూసినంత ఫీలింగ్ కలుగుతుంది, ఆ పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు వచ్చే శంకర్ గ్రాండ్ సాంగ్స్ లో ఆ సహజత్వం మిస్ అయింది.

శంకర్ ఒకప్పుడు ప్రతి సినిమాలో ఒకటే మెసేజ్ ని స్పష్టంగా ఒక సమస్య తీసుకొని దాని చుట్టూ కథ అల్లుకునేవాడు. చాలా వరకు అతని సినిమాల్లో లంచం, అవినీతి.. ఇలాంటివే ఉన్నా ఒక పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. కానీ ఇప్పుడు మెసేజ్ మీద దృష్టి పెట్టడం పక్కనపెడితే బోలెడన్ని సమస్యలు, వాటికి బోలెడన్ని సమాధానాలు చూపిస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ కూడా చేస్తున్నాడు. ఇక ఇండియన్ 2 అయితే అచ్చంగా క్లాస్ పీకినట్టే ఉంటుంది.

Also Read : Bharateeyudu 2 : భారతీయుడు 2 రివ్యూ.. సేనాపతి తిరిగొచ్చి ఏం చేశాడు?

రెండు సినిమాలతో ఫోకస్ మిస్..
భారతీయుడు 2 సినిమా విషయంలో చేసిన ఇంకో తప్పు ఒకేసారి రెండు సినిమాలకు పనిచేయడం. ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఎంత ట్యాలెంటెడ్ మనిషి అయినా ఒకేసారి ఒక పని ఫోకస్ గా చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ఒకేసారి రెండు పడవల మీద కాలు పెడితే ఇప్పుడు శంకర్ పరిస్థితులా తయారవుతుంది. గేమ్ ఛేంజర్ సినిమా షూట్ మధ్యలో భారతీయుడు షూట్ చేయడం మళ్ళీ అదయ్యాక వచ్చి చరణ్ గేమ్ ఛేంజర్ చేయడం.. ఇలా గత రెండేళ్లుగా శంకర్ రెండు సినిమాలతో పని చేస్తుండటంతో ఫోకస్ కూడా మిస్ అయి భారతీయుడు 2 మిస్ ఫైర్ అయింది అంటున్నారు.

Also Read : Bharateeyudu 3 : భారతీయుడు 3 స్టోరీ అదేనా? ఫ్లాష్‌బాక్‌లో.. కాజల్, కమల్ హాసన్ యుద్ధ వీరులుగా..

ట్రెండ్‌కి తగ్గట్టు మారాల్సిందే..
అయినా ఒక సినిమా హిట్ అయితే అందులో ఉన్న తప్పులు ఎవరికీ కనపడవు. అదే ఒక సినిమా ఫ్లాప్ అయితే అందులో ఉన్న మంచి కూడా తప్పుగానే కనిపిస్తుంది. హిట్ అవ్వడానికి ఎన్ని కారణాలు ఉంటాయో ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి కూడా అన్నే కారణాలు ఉంటాయి. ఇక మన సినీ పరిశ్రమలలో హిట్ అయితే హీరోకి క్రెడిట్ ఇస్తారు, అదే ఫ్లాప్ అయితే డైరెక్టర్‌ని విమర్శలు చేస్తారు అభిమానులు, ప్రేక్షకులు. ఈ రకంగా కూడా శంకర్‌పై విమర్శలు వస్తున్నాయి. శంకర్ ట్యాలెంట్ ని శంకించడానికి లేదు. ఇప్పటికి ఆయన స్టార్ డైరెక్టర్. కానీ సినిమాలు తీసే విధానం, జనాలకి అందించే విధానంలో శంకర్ ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు మార్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి.

Also Read : Bharateeyudu 2 : ఆ పాట కోసం భారతీయుడు 2 సినిమాకు వెళ్తే.. అసలు ఆ పాటే లేదుగా..

గేమ్ ఛేంజర్‌తో కంబ్యాక్ ఇస్తాడా?
ముఖ్యంగా ఈ రోజుల్లో జనాలు మంచిని సినిమాల్లో మెసేజ్ గా చెప్తే వినడానికి ఎవరూ లేరు. ఆ మెసేజ్ ని ఎంటర్టైనింగ్ గా, ఎంగేజింగ్ గా చెప్పాలి. అప్పుడే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు సక్సెస్ అవుతాయి. భారతీయుడు 2 సినిమా రిజల్ట్ తో అందరి చూపు రామ్ చరణ్ – శంకర్ కాంబోలో రాబోతున్న గేమ్ చెంజర్ సినిమాపైనే పడింది. రెండు సినిమాల మీద పనిచేస్తూ గేమ్ చెంజర్ ని కూడా ఇలా చెయ్యడు కదా అసలే చరణ్ RRR తర్వాత వచ్చే పాన్ ఇండియా సినిమా అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పాటలు, ఫైట్లు, కథ, కథనం.. ఇలా అన్నిటితో మెప్పించే సినిమాలు తీసిన శంకర్ గేమ్ ఛేంజర్ తో అయినా కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి మరి.