ఉచ్చు బిగుస్తోందనే అసమ్మతి గళమా..! వైసీపీ మాజీ ఎంపీలో సడన్ మార్పునకు కారణం ఏంటి?

ఉచ్చు బిగుస్తోందనే అసమ్మతి గళమా..! వైసీపీ మాజీ ఎంపీలో సడన్ మార్పునకు కారణం ఏంటి?

Gossip Garage : అధికార దుర్వినియోగానికి కేరాఫ్ అడ్రస్ ఆ నేత. వాడటం అంటూ మొదలు పెడితే ఆయనకంటే దారుణంగా పవర్ ను ఎవరూ వాడరేమో. గత ఐదేళ్లలో విశాఖలో ఆయన అరాచకం అంతా ఇంతా కాదు. కానీ, సర్ ఇప్పుడు మారిపోయారు. పవరూ, పదవీ.. రెండూ పోయాక.. సాంప్రదాయినీ.. సుప్పినీ, సుద్దపూసనీ.. అనే డైలాగ్ చెబుతున్నారు. ఇంతకీ ఆయన టోన్ మార్చడానికి కారణం ఏంటి? ఉచ్చు బిగుస్తోందనే అసమ్మతి గళం వినిపిస్తున్నారా? పవర్ లో ఉన్న పార్టీలో లేకపోతే తన దందా నడవదని ఫిక్స్ అయిపోయారా? ఆ మాజీ ఎంపీ ఫ్యాన్ గాలితో జలుబు చేస్తుందా? సైకిల్ మీద సవారీ చేస్తేనే తన హెల్త్ కు, దందాలకు బెటర్ అనుకుంటున్నారా?

కూటమికి దగ్గరయ్యేందుకు ఎంవీవీ ప్రయత్నాలు..
అధికారం ఇచ్చే కిక్కే వేరు. పవర్‌ కోల్పోతే అదో తెలియని లోటు. అందుకే ఏ పార్టీ అయినా ఎప్పుడూ తమదే అధికారం కావాలని కోరుకుంటుంది. లీడర్లు కూడా పవర్‌లో ఉన్న పార్టీలోనే ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు ఏపీలో వైసీపీకి చెందిన చాలా మంది.. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్‌ వరకు అందరూ కండువా మార్చేందుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే విశాఖ మాజీ ఎంపీ తీరు ఆసక్తికరంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మీదే విమర్శలు చేశారు. అధిష్టానానికి కంప్లైంట్ కూడా చేశారు. ఇప్పుడు ఏకంగా వైసీపీ తీరునే తప్పుబడుతూ కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎంవీవీ సత్యనారాయణ.

30 ఏళ్లపాటు నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం చుట్టూ నీలినీడలు..
అధికార బలంతో.. విశాఖ మాజీ ఎంపీ MVV సత్యనారాయణ గత ఐదేళ్లు వ్యవహరించిన తీరే వేరు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. గత ఐదేళ్ల ఆడిందే పాడిందే పాట అన్నట్లుగా నడిపించారు. ఇప్పుడు సార్‌ పరిస్థితి వైకుంఠపాళీ ఆటలో పాము మింగేసినట్లు అయిపోయింది. విశాఖలో ప్రముఖ రియల్టర్‌గా 30 ఏళ్లపాటు నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం చుట్టూ నీలినీడలు కమ్ముకున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో.. ఏ శాఖ ఏ యాక్షన్‌ తీసుకుంటుందోనన్న ఆందోళనతో అలర్ట్ అయ్యారు ఎంవీవీ సత్యనారాయణ.

నీతులు చెప్పడం వెనక కథ వేరే ఉందా?
పవర్‌లో ఉన్నప్పుడే ఎంపీ విజయసాయి రెడ్డి మీద విమర్శలు చేసి హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పుడేమో వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆటవిక రాజ్యం నడవడం వల్లే ఓడిపోయామంటూ నీతులు చెప్తున్నారు. విశాఖలో పార్టీ ఓడడానికి తాను కూడా కారణమన్న విషయాన్ని మర్చి.. పార్టీ మీద నెపం నెడుతున్నారు. అంతేకాదు గతంలో గీతం యూనివర్సిటీ కట్టడాలను కూల్చడం తప్పనేది ఆ మాజీ ఎంపీ వాదన. అక్రమాలకు, భూదందాలకు కేరాఫ్‌గా పేరున్న ఎంవీవీ నీతులు చెప్పడం వెనక కథ వేరే ఉందన్న చర్చ జరుగుతోంది.

ప్రభుత్వం మారడంతో చిక్కుల్లో ప్రాజెక్టులు..
వైసీపీ హయాంలో అధికారం అండతో విలువైన ప్రభుత్వ భూములను… వివాదాల్లో ఉన్న ప్రైవేటు స్థలాలను దక్కించుకుని రియల్‌ వెంచర్లు, భారీ టౌన్‌షిప్పులు నిర్మించాలని ప్లాన్‌ చేశారు. ఇలా ఒక్క విశాఖ నగరంలో దాదాపు 20 ప్రాజెక్టులను స్టార్ట్‌ చేశారు ఎంవీవీ. అయితే తన ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించి మాజీ ఎంపీపై పలు వివాదాలు, ఆరోపణలు ఉన్నాయి. ఐతే గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వమే ఉండటంతో ఆయనను ఎవరూ టచ్‌ చేయలేకపోయారు. ఎంపీగా ఎంవీవీ చెప్పిందే శాసనం అన్నట్లుగా పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు వ్యవహరించడంతో ఆయన ప్రాజెక్టులు చకచకా ముందుకు సాగిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టులన్నీ చిక్కుల్లో పడ్డాయి. అందుకే ఆయన కూటమి వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

గంటా ద్వారా టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు..
అంతేకాదు పసుపు కండువా కప్పుకునేందుకు తెరవెనక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ ద్వారా టీడీపీ గూటికి చేరేందుకు ట్రై చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఎంవీవీ సత్యనారాయణ రాకను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో కొందరు టీడీపీ సీనియర్లతో కూడా ఎంవీవీ సత్యనారాయణ లాబీయింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఎంవీవీ సత్యనారాయణ తీరుపై పవన్ కల్యాణ్ సీరియస్..
కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే MVVపై తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వం యాక్షన్‌ తీసుకోడానికి ముందే ప్రజలే స్వచ్ఛందంగా ఎంవీవీ అక్రమాలపై రోడ్డెక్కారు. ఫలితాలు విడుదలవుతున్న సమయంలోనే ఎంవీవీ మూసివేసిన రోడ్డుని ప్రజలే తెరిపించారు. ఈ క్రమంలోనే సిరిపురం దగ్గర MVV ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ది పీక్ ప్రాజెక్ట్’ను నిలిపేయాలని స్టాప్‌ ఆర్డర్‌ జారీ చేసింది జీవీఎంసీ. ఇక ఆ భూముల్లో మైనింగ్‌కు సంబంధించి అక్రమంగా తవ్వకాలు, పేలుళ్లు చేపట్టారని మైనింగ్‌ శాఖ ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఐదేళ్లు తనకు ఇబ్బందులు తప్పవని సార్ పసిగట్టేశారు. టోన్ మార్చేశారు. ఇప్పుడు మెలోడి వాయిస్ వినిపిస్తున్నారు. కూటమి సర్కార్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఎంవీవీ సత్యనారాయణ తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చేరికకు అడ్డంకులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : వైఎస్ జగన్ సొంత జిల్లాలో పాగా వేయాలని సీఎం చంద్రబాబు స్కెచ్..!

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని కాపాడుకునేందుకు..
ఇప్పటికే నలుగురు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. మద్దాలగిరి, పెండెం దొరబాబు, ఆళ్లనాని, కిలారి రోశయ్య ఫ్యాన్‌ పార్టీకి రిజైన్ చేశారు. అయితే జనసేన లేకపోతే టీడీపీ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైజాగ్ ఎంపీ కూడా జంపింగ్ జపాంగ్ బాటలో ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ఇందుకు ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయి. ప్రభుత్వానికి టార్గెట్‌గా మారడంతో తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని కాపాడుకునేందుకు టీడీపీలో చేరేందుకు లాబీయింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు దగ్గరయ్యేందుకు రాయబారం నెరుపుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఎంవీవీ కోసం ఎవరూ లాబీయింగ్‌ చేయొద్దని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పేసినట్లు టాక్. ఇప్పుడా మాజీ ఎంపీగారి పరిస్థితి పొలిటికల్ లైఫ్, బిజినెస్ డైలమాలో ఉందన్న చర్చ జరుగుతోంది.