విజయవాడ ముంపునకు ప్రధాన కారణం ఏంటి? ఈ పాపం ఎవరిది?

బుడమేరుకు వస్తున్న అత్యధిక వరద మొత్తం కొల్లేరులో కలవాలి. కానీ, వరద ఎక్కడికక్కడ పోటెత్తింది. బుడమేరు ఇంత పెద్ద ఎత్తున వర్షం, వరద రావడం ఇదే తొలిసారి.

విజయవాడ ముంపునకు ప్రధాన కారణం ఏంటి? ఈ పాపం ఎవరిది?

Vijayawada Floods : విజయవాడ నగరం మధ్యలోంచి ప్రవహిస్తున్న బుడమేరు శాపంగా మారింది. బుడమేరులో మూడొంతుల భాగం ఆక్రమణకు గురి కావడంతో నీటి ప్రవాహానికి మార్గం లేకపోయింది. ఆపై కొల్లేరులో ఆక్రమణల వల్ల బుడమేరు వరద నీరు వెనక్కి వెళ్తోంది. ఈ ఆక్రమణలే విజయవాడ ముంపునకు కారణం అని చెబుతున్నారు. బెజవాడ మునిగిపోవడానికి ప్రధాన కారణం బుడమేరు. గత కొంత కాలంగా బుడమేరులో తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆక్రమణలే ముంపునకు కారణంగా చెప్పొచ్చు.

బుడమేరుకు వస్తున్న అత్యధిక వరద మొత్తం కొల్లేరులో కలవాలి. కానీ, వరద ఎక్కడికక్కడ పోటెత్తింది. బుడమేరు ఇంత పెద్ద ఎత్తున వర్షం, వరద రావడం ఇదే తొలిసారి. గతంలో వరద వచ్చినా అది నామమాత్రమే. బుడమేరు మొత్తం ఆక్రమణలతో నిండిపోయింది. రాజకీయపరమైన అంశాలు అనేకం చోటు చేసుకున్న నేపథ్యంలో బుడమేరు కుచించుకుపోయి పిల్ల కాలువలా మారిన పరిస్థితి ఉంది. దాదాపు 20ఏళ్లకు సంబంధించిన ఆపరేషన్ కొల్లేరు పూర్తిగా పక్కదారి పట్టింది.

Also Read : విజయవాడ సింగ్ నగర్‌లో కంటతడి పెట్టించే దృశ్యాలు.. ఖాళీ చేసి వెళ్లిపోతున్న వేలాది మంది ప్రజలు..

ఆపరేషన్ కొల్లేరు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. కానీ, కొల్లేరులో పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించిన వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు ఉన్నాయి. దీంతో ఆపరేషన్ కొల్లేరు పక్క దారి పట్టింది. ఈ నేపథ్యంలోనే బుడమేరకు కూడా శాపంగా మారింది. బుడమేరు నిత్యం ప్రవహిస్తూ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీరంతా నేరుగా వెళ్లి కొల్లేరులో కలవాల్సి ఉంది. అయితే, కొల్లేరు అంతా రాజకీయపరమైన ఆక్రమణలకు గురైన నేపథ్యంలో నీరంతా పోటెత్తే పరిస్థితి నెలకొంది.

2005లో బుడమేరు డైవర్షన్ పనులన్నీ కూడా నిలిపివేశారు. దీంతో బుడమేరుకు పూర్తిగా శాపంగా మారింది. 2005లో బుడమేరు డైవర్షన్ పనులు పూర్తై ఉండుంటే ఈరోజున బెజవాడ నగరానికి ఈ వరద ముంపు ఉండేది కాదు, దాదాపు 2లక్షల 75వేల మంది విజయవాడ నగర వాసులకు ఈ బాధలూ ఉండేవి కావంటున్నారు. 2 లక్షల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఎవరు ఎక్కడ ఉన్నారో లేదో తెలీదు. అసలు సురక్షితంగా ఉన్నారా లేదా అన్నది కూడా తెలియని దుస్థితి. అలాంటి దయనీయ పరిస్థితులు ప్రస్తుతం బెజవాడలో ఉన్నాయి.

బుడమేరకు నీరు వస్తే విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా కరకట్ట పనులు ప్రారంభించారు. అయితే, 2008లో ఆకస్మికంగా కరకట్ట పనులు ఆపేశారు. కరకట్టను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. పెద్ద ఎత్తున ఆక్రమణలు చేశారు. దీంతో బుడమేరు పిల్ల కాలువలా మారింది. దీంతో భారీగా తరలి వచ్చిన వరద నీరు ఎటుపోవాలో తెలియక జనవాసాల్లోకి పోటెత్తిన పరిస్థితి ఉంది. భవానీపురం, సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక, మధురానగర్.. అన్ని ప్రాంతాలను బుడమేరు నీరు పోటెత్తింది.

ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్లు తెరవాలి. ఆపరేషన్ కొల్లేరు పూర్తి చేయాలి. అప్పుడు కానీ బుడమేరుకు వరద ముంపు నుంచి బయటపడే పరిస్థితి లేదంటున్నారు. ఇటు బుడమేరు ఆక్రమణలు, అటు కొల్లేరు ఆక్రమణలు క్లియర్ అయితే తప్ప ఈ రకమైన ముంపు నుంచి బయటపడే అవకాశమే లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు.

విజయవాడ ముంపునకు ప్రధాన కారణం ఇదే..
* బుడమేరులో గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి
* కొల్లేరులో కలిసే మార్గం లేక వెనక్కి వచ్చేస్తున్న బుడమేరు వరద
* బిక్కుబిక్కుమంటున్న బుడమేరు పరిసర ప్రాంతాల బాధితులు
* ప్రమాదకరంగా బుడమేరు వరద నీరు
* బెజవాడ ముంపునకు బుడమేరు వరదే కారణం
* ఆక్రమణలతో కుచించికుపోయిన బుడమేరు
* 20 ఏళ్ల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంటున్న బెజవాడ వాసులు
* ఆపరేషన్ కొల్లేరు ఆగిపోవడమే బుడమేరుకు శాపం
* 2008లో ఏర్పాటు చేసిన కరకట్టను ధ్వంసం చేసిన స్థానికులు
* బుడమేరును ఆక్రమించి పక్క భవనాల నిర్మాణంతోనే వరద ఉధృతి