ఏపీలో ఒక జూలైలోనే 865% పెరిగిన కరోనా కేసులు.. దేశంలోనే అత్యధికం!

  • Published By: sreehari ,Published On : August 1, 2020 / 06:43 PM IST
ఏపీలో ఒక జూలైలోనే 865% పెరిగిన కరోనా కేసులు.. దేశంలోనే అత్యధికం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత ఎక్కువవుతోంది. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక జూలై నెలలోనే దేశంలోనే అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 1,26,337 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 865 శాతం పెరిగింది. అంటే.. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే అత్యధికం.. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఢిల్లీని అధిగమించింది.



దేశంలో మూడవ కరోనా వైరస్ ప్రభావిత రాష్ట్రంగా అవతరించింది. జూన్ 30న కరోనా 14,596 కేసులు నమోదు కాగా.. జూలై చివరి నాటికి ఈ సంఖ్య 1.26 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాగా తూర్పు గోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో 1,800 శాతం కరోనా కేసుల సంఖ్య పెరిగింది. పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరిగింది. కరోనా పాజిటివ్ పరీక్షించిన వారి శాతం జూలైలో 11.9 శాతంగా నమోదైంది.



రాష్ట్రంలో శుక్రవారం (జూలై 31) రోజున మాత్రమే రాష్ట్రంలో 10,376 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా 1,40,933 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 68 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1,349కు చేరింది. ఇక రికవరీ రేటు 45.3 శాతంగా ఉండగా, మొత్తం పాజిటివిటీ రేటు 7.22 శాతంగా నమోదైంది.

గత మూడు రోజులలో రాష్ట్రంలో 30,636 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతక వైరస్ సోకిన వారి సంఖ్య 1,40,933కు చేరింది. ఇందులో 1,349 కరోనా మరణాలు ఉన్నాయి. ఈ జాబితాలో వారాలుగా మహారాష్ట్ర, తమిళనాడుల తర్వాత మూడవ స్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీలో 1,195 కేసులతో మొత్తం 1,35,598 కేసులకు చేరుకుంది.


ఒక రోజులో 3,822 మంది రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంమీద, 63,864 మంది కోలుకున్న తరువాత రాష్ట్రంలో ఇప్పుడు 75,720 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్ వెల్లడించింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రాష్ట్రం ఇప్పటివరకు 19,51,776 టెస్టులను మిలియన్ జనాభాకు 36,550 చొప్పున పూర్తి చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న విస్తృతమైన’ COVID-19 పరీక్షలే కేసుల సంఖ్య తీవ్రంగా పెరగడానికి ప్రధాన కారణమని ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఎకెకె శ్రీనివాస్ చెప్పిన సంగతి తెలిసిందే.