ఏపీలో మూడు ముక్కలాట.. వైసీపీ, బీజేపీ కలిసి డ్రామా ఆడుతున్నాయా? లేక టీడీపీ, బీజేపీ చేతులు కలిపాయా?

  • Published By: naveen ,Published On : October 5, 2020 / 03:03 PM IST
ఏపీలో మూడు ముక్కలాట.. వైసీపీ, బీజేపీ కలిసి డ్రామా ఆడుతున్నాయా? లేక టీడీపీ, బీజేపీ చేతులు కలిపాయా?

ap politics: ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. పార్టీల మధ్య మూడు ముక్కలాట మొదలైంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య ఓ జాతీయ పార్టీ పావులా మారుతోందనే టాక్‌ నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో పట్టు కోసం మరోపక్క బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ, వైసీపీ కలసి గేమ్స్‌ ఆడుతున్నాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కాదు.. కాదు… బీజేపీ, టీడీపీ కలసి ఆటలాడుతున్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

రాష్ట్రంలో ఒకలా, కేంద్రంలో మరోలా:
వివిధ వివాదాస్పద అంశాలపై వైసీపీపై బీజేపీ పోరాటం సాగిస్తోంది. రాష్ట్రంలో ఎలాగైనా బలాన్ని పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. వైసీపీని టార్గెట్‌ చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ నేతలు అటు వైసీపీని, ఇటు టీడీడీపీ టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో మాత్రం రెండు పార్టీలు ఒకటిగానే వ్యవహరిస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు కలసి రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నాయని అంటున్నారు.

బీజేపీ అజెండానే టీడీపీ అనుసరిస్తోందా?
బీజేపీ అజెండానే టీడీపీ అనుసరిస్తోందని వైసీపీ నేతలు దుయ్యబడుతున్నారు. రాష్ట్రంలో తాము చేపడుతున్న పనులను అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని కౌంటర్స్‌ వేస్తున్నారు. బీజేపీ ఏ అంశాన్ని తీసుకున్నా.. దానికి మద్దతిచ్చేలా టీడీపీ కూడా అదే అంశాన్ని భుజాన ఎత్తుకుంటోందని.. దీనిని బట్టే బీజేపీ, టీడీపీలు కలసి పనిచేస్తున్నాయనే విషయం అర్థమవుతోందని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్‌. తమను ఎలా అయినా ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహంతోనే ఆ పార్టీలు ప్లాన్స్‌ వేసుకున్నాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

వైసీపీ, బీజేపీ చేతులు కలిపాయా?
వైసీపీ, బీజేపీలు కలసి ప్లాన్‌ చేసుకొని, తమ పార్టీని కార్నర్‌ చేయాలని చూస్తున్నాయంటూ టీడీపీ నేతల అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో నెంబర్‌ టూగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వైసీపీ ఇందుకు సహకారం అందిస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. కానీ, బయటకు రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం ఉన్నట్టుగా కలరింగ్‌ ఇస్తూ.. టీడీపీని ఇరకాటంలో పెట్టాలన్నదే వాటి వ్యూహమని భావిస్తున్నారు. తమను సైడ్‌ చేసేస్తే.. బీజేపీ బలోపేతం అవుతుందనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు.

టీడీపీ, బీజేపీలు డ్రామాలు ఆడుతున్నాయని వైసీపీ విమర్శలు:
వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇబ్బందుల పాల్జేయాలన్న లక్ష్యంతోనే టీడీపీ, బీజేపీలు కలసి డ్రామాలు ఆడుతున్నాయని వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఒకే అజెండాను పట్టుకొని ఆ రెండు పార్టీలు ఆందోళనలు చేయడం వెనుక ఉద్దేశం అదేనని అంటున్నాయి. సొంతంగా రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్న బీజేపీకి ఇప్పుడు ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందని అనుకుంటున్నారు.

వాస్తవానికి రెండు పార్టీలను రాష్ట్ర బీజేపీ నేతలు టార్గెట్‌ చేస్తున్నారు. వైసీపీపై విమర్శలు గుప్పించిన ప్రతీసారి టీడీపీని కూడా దెప్పిపొడుస్తున్నారు ఇక్కడి నేతలు. కానీ, జాతీయ స్థాయి నేతలు మాత్రం బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల సాధ్యపడుతుందా లేదా అనే చర్చ సాగుతోంది.