CPI Narayana : అంతవరకు సీఎం జగన్ బెయిల్ రద్దు కాదు, నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ బెయిల్....

CPI Narayana : అంతవరకు సీఎం జగన్ బెయిల్ రద్దు కాదు, నారాయణ సంచలన వ్యాఖ్యలు

Cpi Narayana

Updated On : July 10, 2021 / 3:23 PM IST

CPI Narayana : ఏపీ రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండదండలు ఉన్నాయని నారాయణ అన్నారు. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారని… అయితే, అమిత్ షా అండ ఉన్నంత కాలం జగన్ బెయిల్ రద్దు కాదని చెప్పారు. మరోవైపు రఘురాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ కోరుతోందని… వీరిరువురి నాటకాలను అమిత్ షా చూస్తున్నారని కామెంట్ చేశారు.

కేంద్ర ప్రభుత్వంపైనా నారాయణ విమర్శలు గుప్పించారు. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. మహమ్మారి వల్ల కార్పొరేట్ ఆసుపత్రులు బాగుపడ్డాయని అన్నారు. మోదీ పాలనలో అంబానీ, అదానీల ఆస్తులు భారీగా పెరిగాయని చెప్పారు. కరోనా వల్ల చనిపోయిన వారికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వలేమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం… కార్పొరేట్లకు మాత్రం రూ. 1.60 లక్షల కోట్లు ఇచ్చిందని మండిపడ్డారు. పబ్లిక్ సెక్టార్ మొత్తాన్ని అమ్మకానికి పెట్టేసిందన్నారు.

మన దేశ చరిత్రలో మోదీ అంతటి దారుణమైన ప్రధాని మరొకరు లేరని నారాయణ అన్నారు. వ్యవసాయ చట్టాలతో రైతులు బానిసలు అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వాజ్ పేయి మంచి రాజకీయ నేత అని ప్రశంసించిన నారాయణ మోదీని మాత్రం విమర్శించారు. సీబీఐ, ఈసీ, ఆర్బీఐ, న్యాయ వ్యవస్థలను మోదీ డమ్మీ చేశారని మండిపడ్డారు.