CM Jagan : దోచుకో, పంచుకో, తినుకో వ్యవహారం చంద్రబాబుది-సీఎం జగన్ ఫైర్

చంద్రబాబు హయాంలో దత్తపుత్రుడితో కలిసి ఆ నలుగురు దోచుకో.. పంచుకో.. తినుకో విధానం అమలు చేస్తే.. ఇప్పుడు ఎక్కడా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుని ఖాతాలో నగదు జమ అవుతోందన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువు మండలాల ప్రకటన చేయాల్సి వచ్చేదన్నారు జగన్.

CM Jagan : దోచుకో, పంచుకో, తినుకో వ్యవహారం చంద్రబాబుది-సీఎం జగన్ ఫైర్

CM Jagan : ఏపీ సీఎం జగన్ నేడు వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ ఏడాది రెండో విడత నిధులను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో విడుదల చేశారు. 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ 2,096.04 కోట్ల నిధులు జమ చేశారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ 13,500 చొప్పున ఇప్పటివరకు రూ.51 వేలు అందించామని సీఎం జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు జగన్. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు జగన్. చంద్రబాబు హయాంలో కరువు కాటకాలు రాజ్యమేలాయన్నారు. ప్రతీ ఏటా కరువు మండలాలు ప్రకటించారని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు-కరువు కవల పిల్లలని ఎద్దేవా చేశారు.

”చంద్రబాబు హయాంలో రైతులు ఇబ్బందులు పడేవారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కల్తీ జరిగేవి. అప్పట్లో రాష్ట్రంలో 12 వ్యవసాయ ల్యాబ్ లు మాత్రమే ఉండేవి. గతంలో ఇన్ పుట్ సబ్సిడీ ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో తెలిసేది కాదు. దోచుకో, పంచుకో, తినుకో.. ఇదీ.. చంద్రబాబు తీరు” అని ధ్వజమెత్తారు జగన్. చంద్రబాబు హయాంలో రైతు రుణ మాఫీ పేరుతో మోసం చేస్తే.. ఈ ప్రభుత్వంలో రైతులు కోలుకొని మళ్లీ రుణాలు పొందుతున్నారని జగన్ చెప్పారు.

గతంలో ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్.. ఇప్పటికంటే అప్పులు ఎక్కువ చేసినా.. చంద్రబాబు హయాంలో రైతులకు, పేదలకు ఎందుకు మంచి జరగలేదని ప్రశ్నించారు జగన్. ఇదే విషయాన్ని ప్రజలంతా ఆలోచించాలని సూచించారు. ప్రతీ కుటుంబానికి ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా అనేది గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచ చేసి.. నిర్ణయం తీసుకోండంటూ సీఎం పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో దత్తపుత్రుడితో కలిసి ఆ నలుగురు దోచుకో.. పంచుకో.. తినుకో విధానం అమలు చేస్తే.. ఇప్పుడు ఎక్కడా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారుని ఖాతాలో నగదు జమ అవుతోందన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీ ఏటా కరువు మండలాల ప్రకటన చేయాల్సి వచ్చేదన్నారు జగన్.

దేవుడి దయవల్ల రాష్ట్రంలో వానలు సమృద్ధిగా కురుస్తున్నాయన్న జగన్.. ఈ మూడున్నరేళ్ల పాలనలో ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. రైతులకు తమ ప్రభుత్వం లాగా దేశం మొత్తంలో ఏ ప్రభుత్వం చేయటం లేదన్నారు. ముందుగానే క్యాలెండర్ ప్రకటించి క్రమం తప్పకుండా ప్రతీ కుటుంబానికి అండగా నిలుస్తున్నామని సీఎం చెప్పారు. చంద్రబాబు సీఎంగా లేకపోవటంతో మద్దతు మీడియా – దత్తపుత్రుడు ఓర్చుకోలేకపోతన్నారని.. వారి ప్రచారం నమ్మవద్దని సీఎం సూచించారు. అన్ని ప్రాంతాలు, ప్రజలు అభివృద్ధి చెందాలనేది తమ విధానమని స్పష్టం చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు సీఎం జగన్. దత్తపుత్రుడు అంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబును సీఎంగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు, దత్త పుత్రుడు ఏం చేస్తున్నారో గమనించండని అన్నారు. అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు మధ్య తేడా గమనించాలన్నారు. అప్పుల పెరుగుదల అప్పటి కంటే ఇప్పుడు తక్కువేనన్నారు. మీకు జరుగుతున్న మంచిని ఆలోచించి నిర్ణయం తీసుకోండని ప్రజలను కోరారు జగన్. చంద్రబాబు, పవన్ ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతున్నారని ఆరోపించిన జగన్.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో గమనించాలని ప్రజలకు సూచించారు సీఎం జగన్.

”మన కర్మ ఏమిటంటే, రాష్ట్రంలో ఇంత గొప్ప మార్పులు జరుగుతుంటే ఎల్లో మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోంది. దుష్ట చతుష్టయం మాటలు నమ్మొద్దు. వీళ్లందరూ రాష్ట్రంలో ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆనాటికీ, ఈనాటికీ తేడా ఒకసారి గమనించాలి. అప్పటికీ, ఇప్పటికీ తమ బతుకులు ఎలా ఉన్నాయో ప్రజలే తమ గుండెల మీద చేయివేసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రజల బతుకుల గురించి ఏ మీడియానో, ఏ దత్తపుత్రుడు చెబితేనో నమ్మవద్దని” ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్.