Chandrababu Naidu: రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్ పై డీజీపీకి లేఖ రాసిన మాజీ సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నేరాలపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాల తీవ్రతను హెచ్చరిస్తూ రాష్ట్ర డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.

Chandrababu Naidu: రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్ పై డీజీపీకి లేఖ రాసిన మాజీ సీఎం చంద్రబాబు

Chandrababu

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నేరాలపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేరాల తీవ్రతను హెచ్చరిస్తూ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు సహా, పెరుగుతున్న క్రైం రేట్ వివరిస్తూ సోమవారం చంద్రబాబు లేఖరాశారు. నేరాలను అదుపు చెయ్యడంలో పోలీసుల వైఫల్యంపై లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ విచ్చిన్నం అయ్యిందని, జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు..ఆయా అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, ఇతర వీడియోలు లేఖకు జతచేశారు.

Also read:Repalle: రేపల్లె ఘటన మానవాళికే సిగ్గుచేటు – మంత్రి

ఇటీవల జి కొత్తపల్లిలో గంజి ప్రసాద్ హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు కారణం అంటూ స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పిందని, శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై వైసీపీ గుండాలు దాడికి పాల్పడితే..దాడిని నివారించడంలో పోలీసుల విఫలం అయ్యారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో దారుణం జరిగేది కాదని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయన్న చంద్రబాబు..గంజాయి సరఫరాలో వైసీపీ నేతల ప్రమేయం కనిపిస్తున్నా..పోలీసుశాఖ తగు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

Also read:Vijayawada Crime: విజయవాడలో బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

అనంతపురంలో పెన్షన్ అడిగిన పాపానికి పోలీసు అధికారి టీడీపీ కార్యకర్తపై దాడి చెయ్యడం డిపార్ట్మెంట్ లో పరిస్థితికి అద్దం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో పట్టపగలు తుపాకీతో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగిందని..దోపిడీకి పాల్పడిన దుండగుడి ఆచూకీ కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ పోలీసులు స్పందించకున్నా..కర్ణాటక పోలీసులు వైసీపీ ఎంపీటీసీని అరెస్టు చేశారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

Also read:Repalle: రేపల్లె ఘటన బాధితురాలికి నేడు హోం మంత్రి తానేటి వనిత పరామర్శ

తాజాగా ఏపీ నుంచి అస్ట్రేలియాకు డ్రగ్స్ తరలించే కేసులో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాయని..ఈ అన్ని అంశాల్లో ఏపీ పోలీసుల వైఫల్యం ప్రజలకు అర్ధం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. నేరాలకు పాల్పడే నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు…లా అండ్ ఆర్డర్ అమలుపై పోలీసు శాఖ దృష్టిపెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు సూచించారు.