Jagananna Vidya Deevena : వారి ఖాతాల్లోకి రూ.694 కోట్లు.. విద్యాదీవెన రెండో విడత నిధులు విడుదల

10TV Telugu News

Jagananna Vidya Deevena : సీఎం జగన్ రెండో విడత విద్యాదీవెన నిధులు విడుదల చేశారు. 9.88 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దాదాపు 11లక్షల మంది విద్యార్థులకు లబ్ది కలిగిందని సీఎం జగన్ చెప్పారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పై తనలో ఆలోచన కలిగించిన ఓ పేద దంపతుల మాటలను జగన్ గుర్తు చేసుకున్నారు.

“నేను పాదయాత్ర చేసేటప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నుంచి వెళ్లాను. ఆ నియోజకవర్గానికి చెందిన గోపాల్ అన్న దంపతులు చెప్పిన మాటలు ఇప్పటికీ మర్చిపోలేను. ఉన్నత చదువులు చదివించాలంటే ఫీజులు లక్షల్లో ఉన్నాయని, ప్రభుత్వం నుంచి వచ్చే సాయం ఏమాత్రం సరిపోవడం లేదని ఆ దంపతులు చెప్పారు. ఏడాదికి రూ.70 వేలు అప్పులు చేస్తే కానీ కొడుకు చదువుకోలేని పరిస్థితి ఏర్పడిందని వారు వివరించారు. కానీ, తల్లిదండ్రుల పరిస్థితి చూసి ఆ కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో గోపాల్ అన్న తన కొడుకు ఫొటో పెట్టుకుని ఉన్నాడు. తన బాధ చూడలేక కొడుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ గోపాల్ అన్న చెప్పిన మాటలు మనసంతా కలచివేశాయి. అధికారంలోకి రాగానే ఇలాంటి పరిస్థితులు మార్చాలని ఆనాడే అనుకున్నా. ఈ క్రమంలో వచ్చినవే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన.

ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, మెడిసిన్, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ (విద్యాదీవెన) చేస్తున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా బకాయిలు లేని రీతిలో సకాలంలో తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తున్నాం” అని జగన్ తెలిపారు.

”ఇంకా మనం చాలా వెనకబాటులో ఉన్నాం. రాష్ట్రంలో చదువు రాని వారు 2011 లెక్కల ప్రకారం 33శాతం మంది ఉన్నారు. దేశంలో సగటు చూస్తే 27శాతం మాత్రమే. 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు ఎంతమంది కాలేజీలకు వెళ్తున్నారని చూస్తే.. ఆశ్చర్యకరమైన నంబర్లు కనిపిస్తున్నాయి. మనం బ్రిక్స్‌ దేశాలతో పోల్చి చూసుకుంటాం. బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా, ఇండియా దేశాలతో సరిపోల్చి చూస్తాం. మన దేశంలో కేవలం 27శాతం మంది మాత్రమే కాలేజీలకు వెళ్తున్నారు. దాదాపు 73శాతం మంది పిల్లలు ఇంటర్ అయిన తర్వాత కాలేజీల్లో చేరడం లేదు.
పిల్లలు పైచదువులు చదవకపోతే, పై ఉద్యోగాలు సాధించలేకపోతే పేదరికాన్ని తొలగించలేదు. అప్పుల పాలు కాకుండా పిల్లలకు చదువులు అందుబాటులోకి వచ్చినప్పుడే వారి తలరాతలు మారుతాయి. అప్పుడే మంచి ఉద్యోగాలు వస్తాయి.

వారి జీవితాలు మారుతాయి. ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావడానికి… అధికారంలోకి వచ్చిన వెంటనే నాన్నగారు ఫీజు రియింబర్స్‌మెంట్‌ విషయంలో ఒక అడుగు ముందుకేస్తే.. జగన్‌ అనే నేను నాలుగు అడుగులు ముందుకు వేశాను. పిల్లలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నాం. తల్లితండ్రులు అప్పులు పాలయ్యే పరిస్థితిని మారుస్తున్నాం. అంతేకాక హాస్టల్‌ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తున్నాం. వసతి ఖర్చుల కోసం తల్లిదండ్రులు అప్పులు పాలు కాకూడదని పథకాన్ని అమలు చేస్తున్నాం. వసతి దీవెన కింద ఈ డబ్బు ఇస్తున్నాం. ఫీజు రియింబర్స్‌మెంట్, వసతి దీవెన కోసం ఇంతగా ఖర్చు చేస్తున్నాం.

మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన దాదాపు రూ.1800 కోట్లు తీర్చడమే కాకుండా, రూ.4,207 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ రెండో ఏడాది, మొదటి ఏడాది కలిపి రూ. 5,573 కోట్లకుపైగా పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్‌ చెల్లించాం. మొదటి విడత ఏప్రిల్‌లో, రెండో విడత ఇవాళ చెల్లించాము. మూడో విడత డిసెంబర్‌లో, నాలుగో విడత ఫిబ్రవరిలో చెల్లిస్తాం. విద్యారంగంలో ఇప్పటివరకూ మనం చేసిన ఖర్చు ఈ రెండేళ్ల కాలంలోనే జగనన్న అమ్మ ఒడి ద్వారా 44,48,865 మంది తల్లులకు రూ.13,022 కోట్లు జమ చేశాం.

విద్యాదీవెన ద్వారా 18,80,934 మందికి రూ.5,573 కోట్లు, జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మందికి రూ. 2,270 కోట్లు, జగనన్న గోరుముద్ద ద్వారా రూ. 36,88,618 మందికి రూ.1600 కోట్లు, జగనన్న విద్యా కానుక ద్వారా 47,00, 000 మందికి రూ.647 కోట్లు, మన బడి నాడు-నేడు కింద తొలిదశలో రూ.3,564 కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేశాం. మొత్తంగా 1,62,75,373 మందికి 26,677.82 కోట్లు ఖర్చు చేశాం. ఇవి కాక అంగన్‌వాడీల్లో కూడా వైయస్సార్‌ సంపూర్ణ పోషణ కోసం రూ.1800 కోట్లు పెట్టాం. ప్రతి అడుగులోనూ చదువుకు అత్యంత పెద్ద పీట వేసే ప్రభుత్వం మనది. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ను తీసుకొచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెనల వల్ల పిల్లలు ఇంకా బాగా చదవాలని కోరుకుంటున్నా. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న వారికి రూ.20వేల రూపాయలు ఇస్తున్నాం” అని జగన్ అన్నారు.

10TV Telugu News