Krishna River Water : తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం

తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కృష్ణా జలాల వివాదంపై సెప్టెంబర్ 1న రెండు రాష్ట్రాలతో కేఆర్‌ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.

Krishna River Water : తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం

Krishna Water

Krishna river Water dispute : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కృష్ణా నది జలాలను ఫిఫ్టీ ఫిఫ్టీ పంచాలన్న తెలంగాణ డిమాండ్‌ను ఒప్పుకోమని ఏపీ చెబుతుంటే.. కృష్ణా జలాల్లో తమకు రావాల్సిన న్యాయపరమైన వాటా కోసం ఎంతవరకైకా వెళ్తామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.

రెండు రాష్ట్రాల్లోని నదీ జలాలపై కేంద్రం పెత్తనం చెలాయించే దాకా వచ్చినా.. ఏకంగా గెజిట్ జారీ చేసి నదీజలాల పంపిణీని కేంద్రం తన పరిధిలోకి తీసుకున్నా.. తెలుగు రాష్ట్రాల తీరు మాత్రం మారడం లేదు. ఏపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి వల్ల ఏపీకి రావాల్సిన నీరు వృధాగా పోతుందని ఏపీ ప్రభుత్వం వరుస పెట్టి లేఖలు రాస్తున్నాయి.

తాజాగా ఏపీ సర్కార్ తెలంగాణా నదీజలాల పంపకంపై కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఆ లేఖలో కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వైఖరిని ఏపీ ప్రభుత్వం తప్పుబట్టింది. కృష్ణా ట్రిబ్యునల్ గతంలోనే రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసిందని, ఏపీ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు పైన ఇంకా ట్రిబ్యునల్ దగ్గర విచారణ జరుగుతోందని కూడా ఏపీ సర్కార్ లేఖలో స్పష్టం చేసింది.

ఇలాంటి సమయంలో తెలంగాణా ప్రతిపాదించిన ఫిఫ్టీ.. ఫిఫ్టీ ఫార్ములా సమంజసం కాదని లేఖలో తెలిపింది జగన్ సర్కార్. రెండో ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు 70: 30 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరపాలని కోరింది ఏపీ ప్రభుత్వం. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని.. లేఖలో స్పష్టం చేసింది.

కృష్ణా జలాల వివాదంపై సెప్టెంబర్ 1న రెండు రాష్ట్రాలతో కేఆర్‌ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ అడుగుతున్న ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ ఫార్ములపై ఏపీ ప్రభుత్వ స్పందన తెలియజేయాలంటూ లేఖ రాసింది KRMB. ఈ ప్రతిపాదనకు ఒప్పుకోమంటూ ఇప్పుడు బదులిచ్చింది ఏపీ సర్కార్‌. అటు… తెలంగాణ శ్రీశైలం ప్రాజెక్టులో సాగిస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఇప్పటికే ఏపీ ఇరిగేషన్ అధికారులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిమట్టం 854 అడుగులకు చేరితే కానీ రాయలసీమకు నీరు ఇవ్వలేమని లేఖలో తెలిపారు ఏపీ ఈఎన్సీ. అంతేకాదు పూర్తిస్థాయి నీటిమట్టం సాగర్‌లో ఉందని, విద్యుదుత్పాదన కారణంగా వృధాగా పోతున్న జలాలను, తెలంగాణ కోటా నుంచి మినహాయించాలని ఏపీ లేఖ రాసి ట్విస్ట్ ఇచ్చింది.

తెలంగాణ మాత్రం ఈసారి ఎలాగైనా కృష్ణా జలాలను చెరి సమానంగా పంచాల్సిందేనంటూ పట్టుబడుతోంది. సెప్టెంబర్ 1న జరగబోయే KRMB సమావేశానికి తెలంగాణ హాజరుకావాలని నిర్ణయించిన కేసీఆర్.. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలని అధికారులను దిశానిర్దేశం చేశారు.

కృష్ణా జలాల్లో వాటా కోసం KRMB, ట్రిబ్యునల్స్ సహా అన్నిరకాల వేదికల మీద బలమైన వాదనలు వినిపించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పక్కా సమాచారంతో KRMB సమావేశంలో సమర్థవంతంగా వాదనలు వినిపించాలని సూచించారు. కృష్ణా జలాల్లో చెరి సగం పంచాల్సిందేనంటూ తెలంగాణ వాదిస్తుండటం.. ఏపీ దీనికి అంగీకరించేది లేదని చెప్పడంతో.. ఈ సమావేశం ఎలా జరుగుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.