తెలుగుదేశం పార్టీకి నిమ్మగడ్డ నోటీసులు

తెలుగుదేశం పార్టీకి నిమ్మగడ్డ నోటీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు అధికార పార్టీకి, ఎస్‌ఈసీకి మధ్య కాక పుట్టిస్తున్న సమయంలోనే.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసింది వైసీపీ. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఈసీ స్పందించింది. మేనిఫెస్టో విడుదలపై ఆ పార్టీని వివరణ కోరింది ఎస్‌ఈసీ. టీడీపీకి నోటీసులు జారీచేసి, ఫిబ్రవరి 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

పార్టీ రహిత ఎన్నికలైన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మేనిఫెస్టో ఎన్నికల నియమావళికి విరుద్ధమని, తక్షణమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరింది. పార్టీలకు అతీతంగా.. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్లో.. పార్టీ గుర్తులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు రాజకీయ పార్టీలు వాడకూడదని చట్టం స్పష్టంచేస్తోందని కమిషన్‌ దృష్టికి వైసీపీ తీసుకెళ్లింది.

ఈ క్రమంలోనే మేనిఫెస్టో ప్రతులను పంచాయతీల్లో పంచేందుకు టీడీపీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. వారి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, ‘పల్లె ప్రగతి-పంచసూత్రాలు’ పేరుతో ప్రచురించిన ఎన్నికల మేనిఫెస్టోపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసింది.