చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వరుసదాడులు

  • Published By: srihari ,Published On : May 24, 2020 / 09:06 AM IST
చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై వరుసదాడులు

చిత్తూరు జిల్లాలో వాలంటీర్లపై  వరుసదాడులు కొనసాగుతున్నాయి. నిన్న శ్రీకాళహస్తిలో వాలంటీర్ పై దాడి జరుగగా తాజాగా పలమనేరు, కలకడ మండలాల్లో వాలంటీర్లపై దాడులకు పాల్పడ్డారు. చెప్పిన పనులు చేయలేదంటూ నేతలు దాడులకు  పాల్పడుతన్నారు. పలమనేరు మున్సిపాలిటీలో తాము చెప్పిన పనులు చేయ్యాలని వాలంటీర్ సౌమ్యపై అధికార పార్టీ మహిళ నాయకురాలు చేయి చేసుకుంది. 

కలకడ మండలంలోని నవాట్ పేట గ్రామ సచివాలయ వాలంటీర్ జ్యోత్స్న, ఆమె కుటుంబంపై అదే గ్రామానికి చెందిన శంకర్ నాయుడు, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. జ్యోత్స్న, ఆమె కుంటుంబ సభ్యులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలపై వార్డు వాలంటీర్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. 

చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటేనే వాలంటీర్లు భయపడుతున్నారు. నిన్న శ్రీకాళహస్తిలో ముగ్గురు వాలంటీర్లపై స్థానిక టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా చిత్తూరు జిల్లాలో మరో రెండు ఘటనలు  చోటు చేసుకున్నాయి. ఒకటి పలమేరు, మరోటి కలకడలో జరిగింది. 

పలమనేరులో సౌమ్య అనే వాలంటీర్ పై స్థానిక వైసీపీ మహిళ నాయకురాలు సావిత్రమ్మ ఏకంగా చేయి చేసుకున్నారు. ఆమె చెప్పినవారినే అర్హులుగా చేర్చుకోవాలని, వారికి పథకాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మాట వినలేదని అందరి ముందు ఏకంగా కొట్టడంతో చివరకు వ్యవహారం సీరియస్ గా మారింది. వాలంటీర్ నేరుగా జిల్లా ఎంపీ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. 

కలకడ మండలం నవాబ్ పేట గ్రామ సచివాలయంలో వాలంటీర్ గా పని చేస్తున్న జ్యోత్స్నపై అదే గ్రామానికి చెందిన శంకర్ నాయుడు, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. శంకర్ నాయుడు గ్రామంలో నీటి సరఫరా చేస్తే ఉంటాడు. అయితే నీళ్లు సక్రమంగా పంపడం లేదని స్థానికుల వద్ద నుంచి తమకు ఫిర్యాదులు అందుతున్నాయని శంకర్ నాయుడును వాలంటీర్ నిలదీశారు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన శంకర్ నాయుడు…వాలంటీర్ గా తననే బెదిరిస్తావా, ఎదిరిస్తావా అంటూ ఒక్కసారిగా వాలంటీర్ జ్యోత్స్న, ఆమె కుంటుబీకులపై దాడి చేశాడు.  ఆమె ఇంట్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశాడు. దీంతో కన్నీరుమున్నీరైన జ్యోత్స్న కలకడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అయితే వరుసగా శ్రీకాళహస్తి, పలమనేరు, కలకడలో జరిగిన దాడి ఘటనలతో వాలంటీర్లంతా ఒక్కసారిగా విలవిల్లాడుతున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల తమ మాట వినడం లేదని టీడీపీ నేతలు వాలంటీర్లపై ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం వాలంటీర్లపై అభద్రతాభావం నెలకొంది.