వైసీపీ నుంచి గంటాకు ఆహ్వానానికి కారణం అతడేనా? విశాఖ ఎన్నికల్లో గెలవాలంటే గంటాను చేర్చుకోవాల్సిందేనా?

  • Published By: naveen ,Published On : July 29, 2020 / 02:06 PM IST
వైసీపీ నుంచి గంటాకు ఆహ్వానానికి కారణం అతడేనా? విశాఖ ఎన్నికల్లో గెలవాలంటే గంటాను చేర్చుకోవాల్సిందేనా?

అవంతి శ్రీనివాసరావు.. గంటా శ్రీనివాస్‌రావు.. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన లీడర్లు. ఇప్పుడు మాత్రం చెరో దారిలో నడుస్తున్నారు. పార్టీ మారినా పదవులు చేపట్టడంలో న్యాక్‌గా వ్యవహరిస్తారనే టాక్‌ ఉంది వీళ్లిద్దరికి. నిజానికి అవంతికి రాజకీయ గురువు గంటానే. కానీ ఇప్పుడు మాత్రం మంటపుట్టే మంత్రాంగం నడుస్తుందనే ప్రచారం నడుస్తోంది.

భీమిలి నుంచి పోటీ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు:
పీఆర్పీ కాంగ్రెస్‌ విలీనంతో గంటా అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికలకు ముందు సైకిల్ దిగిన అవంతి.. వైసీపీ గూటికి చేరారు. అయితే భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంలో ఇద్దరి మధ్య అప్పట్లోనే విభేదాలొచ్చాయి. ఈ క్రమంలోనే విశాఖ ఉత్తరం నుంచి గంటా.. భీమిలి నుంచి అవంతి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం అవంతి మంత్రిగా పనిచేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా అవకాశం వచ్చినప్పుడల్లా గంటాపై గరం గరం అవుతూనే ఉన్నారు అవంతి.



అవంతి తీరుతో విసిగిపోయారట, అందుకే గంటాకు ఆహ్వానం:
ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలపై అసభ్య పోస్టింగ్‌లు పెడుతున్నారనే ఆరోపణలతో గంటా సన్నిహితుడు నలందా కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో మంత్రి అవంతి, ఎంపీ విజయసాయి రెడ్డిలు గంటా అరెస్ట్‌ తప్పదని హెచ్చరించారు. భీమిలిలో జరిగిన భూదందాలో గంటా హస్తం ఉందని.. మంత్రిగా పనిచేసిన సమయంలో సైకిళ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఇద్దరు నేతలు ఆరోపించారు. వీళ్లందరికి షాక్‌లిస్తూ గంటా వైసీపీతో మంత్రాంగాన్ని నడిపారు. ఒకప్పుడు గంటా రాకను వ్యతిరేకించిన వారే.. ఇప్పుడు అవంతి తీరుతో విసిగిపోతున్నారట. దీంతో గంటా రాకను పరోక్షంగా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది.

టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యం:
పైకి ఎవరూ బాహటంగా విమర్శలు చేయకపోయినప్పటికీ అవంతికి ప్రజా ప్రతినిధుల మధ్య చాలా గ్యాప్ వచ్చిందట. ఈ కారణంగానే జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి, పెందుర్తికి చెందిన ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో ఆయనతో కలిసి ప్రెస్‌మీట్లలో పాల్గొనలేదని తెలుస్తోంది. మొదటి నుంచి వైసీపీని నమ్ముకుని ఉన్న కార్యకర్తల్ని అవంతి లెక్కచేయడం లేదట. టీడీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కొంతమంది నేతలు ఆఫ్‌ ది రికార్డ్‌లో చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ విజయసాయి రెడ్డికి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందట.

గంటాను అడ్డుకోవడానికి అవంతితో పాటు విజయసాయి ప్రయత్నాలు:
మరోవైపు గంటా రాకను అడ్డుకునేందుకు అవంతితో పాటు విజయసాయి రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అన్నీ నిశితంగా గమనిస్తూ వచ్చిన గంటా.. సీఎం జగన్‌ సన్నిహితుల్ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యారట. ఇదే సమయంలో జీవీఎంసీ ఎన్నికల్లో గెలవాలంటే అవంతి కన్నా గంటానే కీలకం అవుతారని కొంతమంది సీఎం దృష్టికి తీసుకెళ్లారట. దీంతో గంటాకు లైన్‌ క్లియర్ అయిందనే ప్రచారం జోరుగా నడుస్తోంది.

గురువు వస్తే శిష్యుడి పరిస్థితి ఏంటి?
అవంతి విషయంలో చాలామంది డిసాప్పాయింట్‌గా ఉన్నారట. ఆయనకు చెక్‌ పెట్టేందుకే గంటాను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఒకవర్గం వారికే పనులు చేసి పెట్టడం కూడా అవంతికి మైనస్‌గా మారిందట. ఒకవేళ గంటా వైసీపీ తీర్థం పుచ్చుకుంటే అవంతి పరిస్థితి ఏంటన్నది ఆయన వర్గీయుల్ని వేధిస్తున్న ప్రశ్న. మరోవైపు అవంతి తన గురువుతో కలిసి పనిచేస్తారా..? అధిష్టానం సర్దుకుపోవాలన్న సూచల్ని పరిగణనలోకి తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.