కొడైకెనాల్ లో తెలంగాణ యువజంట ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : August 8, 2020 / 09:00 PM IST
కొడైకెనాల్ లో తెలంగాణ యువజంట ఆత్మహత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరి కోసం ఒకరన్నట్లు బతికారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కాసింత ఓర్పుగా ఉండి ఉంటే మంచి రోజులు వచ్చేవి. కానీ తొందరపాటు చర్యతో దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ యువ జంట కొడై కెనాల్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఖమ్మం జిల్లా మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ (26), భద్రాచలం మండలం చోడవరానికి చెందిన ఏపూరి నందిని (26) కొడైకెనాల్ లోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈ జంట 2018 లో హైదరాబాద్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు కొడైకెనాల్‌లోని అన్నయ్‌ థెరెస్సా యూనివర్సిటీ సమీపంలోని ఓ ఇంట్లో ఏడాది కాలంగా నివాసముంటున్నారు.

కాగా… ఇంటికి రెగ్యులర్ గా పాలు, నిత్యావసరాలు అందించే కుర్రోడు శుక్రవారం తెల్లవారు ఝూమున పాలు తీసుకు వచ్చాడు. తలుపు కొట్డగా లోపలి నుంచి స్పందన లేక పోవటంతో ఫోన్ చేశాడు. ఫోన్ చేసినా రెస్పాండ్ కాకపోయే సరికి కిటికీ లోంచి తొంగి చూశాడు. దంపతులిద్దరూ మంచంపై నురగలు కక్కుకుని ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి పరీక్షించగా అప్పటికే వారు మరణించినట్లు గుర్తించారు.

ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి కుటుంబాలతో అంత సఖ్యత లేనట్లు తెలిసింది. లాక్ డౌన్ కారణంగా వారు ఉద్యోగం చేస్తున్న కంపెనీ కూడా జీతాలు ఇవ్వటంలేదని వారు యువకుడి ముందు వాపోయినట్లు చెప్పాడు. గత కొద్ది కాలంగా ఆస్ట్రేలియా వెళ్లటానికి ప్రయత్నిస్తున్నారని యువకుడు పోలీసులకు చెప్పాడు.

అక్కడ అవకాశం వచ్చినా విమానాలు అందుబాటులో లేక పోవటంతో చేరలేకపోయారు. మరో చోట ఉద్యోగం వస్తుందో రాదో అనే భయం.. ఇద్దరూ పుట్టిళ్లకు వెళ్లలేక పోవటంతో మానసికంగా తీవ్ర మనో వేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

డబ్బుల్లేని కారణంగా గత కొద్ది రోజులుగా సెల్ ఫోన్ లు కూడా రీచార్జ్ చేసుకోలేదని తెలిసింది. కాగా నందిని తన తల్లికు రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు.