Drug Peddler : వృత్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ప్రవృత్తి “డ్రగ్స్ డాన్ యోగిత”

బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ డ్రగ్స్ డాన్ గా మారిన యువతిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 

Drug Peddler : వృత్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ప్రవృత్తి “డ్రగ్స్ డాన్ యోగిత”

Drug Peddler

Soft Ware Engineer As Drug Peddler : బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ డ్రగ్స్ డాన్ గా మారిన యువతిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.  దాదాపు  మూడేళ్ళగా విదేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ వాటిని బెంగుళూరు, హైదరాబాద్ లలో  విక్రయిస్తూ  డ్రగ్స్ డాన్ అవతారం ఎత్తింది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   యోగిత. కొన్నాళ్లుగా ఆమెకోసం గాలిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇటీవల ఆమెను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఈమె తరుఫున డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ల కు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు.

బెంగుళూరు ఎలక్ట్రానిక్స్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసే యోగితకు పబ్స్ కు వెళ్లే అలవాటుంది. అక్కడ ఆమె డ్రగ్స్ కు బానిసగా మారింది. వీటికి ఉన్న డిమాండ్ తెలుసుకున్న ఆమె మూడేళ్ళ క్రితం డ్రగ్స్ పెడ్లర్ గా మారి విక్రయించటం మొదలెట్టింది. తనకు డ్రగ్స్ అమ్మిన నైజీరియన్లనే పెడ్లర్ గా మార్చుకుని వారి ద్వారా వినియోగదారులకు అమ్మటం మొదలెట్టింది.

బెంగుళూరులోని నైజీరియన్లకు స్నేహితులైన హైదరాబాద్ లో ఉంటున్న వారిని ఏజెంట్లుగా మార్చుకుంది. డార్క్‌ వెబ్‌ ద్వారా ఆర్డర్లు ఇస్తూ, క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లింపులు చేస్తూ విదేశాల నుంచి భారీ స్థాయిలో డ్రగ్స్‌ను స్మగ్లింగ్‌ చేయించింది. ఈ వ్యవహారంపై మూడు నెలల క్రితమే  ఎన్సీబీ అధికారులకు సమాచారం అందింది.  అప్పటి నుంచి ఆమెను పట్టుకోటానికి అధికారులు వలపన్ని వేచి చూస్తున్నారు. ఆమె గురించి పూర్తి సమచారం దొరక్క పోవటంతో పలు కోణాల్లో ఆమెకోసం గాలిస్తున్నారు.

ఇంటర్నేషనల్ పోస్ట్ ద్వారా దొరికిపోయింది
యోగితకు సంబంధించిన చిరునామా, ఇతర వివరాలు తమ వద్ద లేకపోవడంతో అధికారులు వేచి చూశారు. ఈమెను  పట్టుకోవడానికి విదేశాల నుంచి వచ్చే అనుమానాస్పద పార్శిల్స్‌పై  నిఘా పెట్టారు. విదేశాల నుంచి వచ్చే  అన్ని పార్శిల్స్‌పై ఎంక్వైరీ పెట్టారు. ఈ నేపథ్యంలో గత నెల రెండో వారంలో బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌   సిటీ   పోస్టాఫీసుకు జర్మనీ నుంచి వచ్చిన ఓ ఇంటర్నేషనల్‌ పోస్టు పార్శిల్‌పై  ఎన్సీబీ అధికారుల దృష్టి పడింది.

కాస్మోటిక్స్, శాండ్‌విచ్‌   గ్రిల్‌ తదితరాల పేరుతో  వచ్చిన దాన్ని డెలివరీ చేయడానికి పోస్టుమ్యాన్‌ వెళ్లగా ఆ చిరునామా లభించలేదు.  దీంతో ఆ పార్శిల్ వెనక్కు తీసుకు వచ్చాడు. అప్పటికే దానిపై దృష్టి పెట్టిన ఎన్సీబీ   అధికారులు పోస్ట్‌మ్యాన్ తో టచ్‌లో   ఉండి   దాని డెలివరీని ట్రాక్ చేశారు.   ఎన్సీబీ అధికారులు మూడు రోజుల పాటు   ఆ పోస్టాఫీస్‌ వద్దే మాటు వేసి ఉన్నారు. మూడో రోజు పోస్టాఫీస్‌కు వచ్చిన యోగిత పార్శిల్‌  తీసుకువెళ్తుండగా పట్టుకున్నారు.

యోగితను అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు ఆ పార్శిల్‌ను విప్పి చూడగా అందులోని వస్తువుల మాటున అర కేజీ   ఎండీఎంఏ   ఉన్నట్లు గుర్తించారు.   వివిధ దేశాల నుంచి ఇంటర్నేషనల్‌   పోస్టు ద్వారా వస్తువుల  మాటున డ్రగ్స్‌ తెప్పిస్తున్నట్లు  యోగిత అంగీకరించింది.

ఇలా వచ్చిన వాటిని నైజీరియన్ల ద్వారానే బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు పంపుతున్నట్లు అంగీకరించింది.   బెంగుళూరులో ఉన్న  ఆమె ఏజెంట్లు  వినియోగదారులకు మాదక  ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు   ఎన్సీబీ ఆధారాలు సేకరించింది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఆమె నెట్‌వర్క్‌ లోని వ్యక్తులను   పట్టుకోవటంలో   నిమగ్నమైన అధికారులు త్వరలో హైదరాబాద్‌ లోని పెడ్లర్లను కూడా అదుపులోకి  తీసుకోనున్నారు.