నాగార్జున ఫామ్ హౌస్ లోని శవం వివరాలు లభ్యం

  • Published By: chvmurthy ,Published On : September 20, 2019 / 10:37 AM IST
నాగార్జున ఫామ్ హౌస్ లోని శవం వివరాలు లభ్యం

ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన షాద్‌నగర్‌ ఫామ్ హౌస్ లోని షెడ్డులో  బుధవారం బయటపడిన కళేబరం  వివరాలు తెలిశాయి. శవం జేబులోని ఆధార్  కార్డు సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడిని పాపిరెడ్డి గూడకు చెందిన  చాకలి పాండుగా(32) గుర్తించారు. అతడు అక్కడే విషపు గుళికలు తిని ఆత్మహత్యచేసుకుని ఉంటాడని  తెలుస్తోంది.  ఈ ఘటన దాదాపు ఆర్నెల్ల నుంచి ఏడాదిలోపు జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం …. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడకు చెందిన అంజయ్య-జంగమ్మ దంపతుల కుమారుడు పాండు. నలుగురు సంతానంలో పాండు చిన్నవాడు. పాండుకు తన అన్న కుమార్ అంటే విపరీతమైన ఫ్రేమ. కుమార్ కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అప్పటినుంచి అతనిపై  ఉన్న అనుబంధంతో పాండు మానసికంగా కుంగి పోయాడు. అన్నిటి మీద విరక్తి కలిగి, దేని మీదా ఆశ లేదని సోదరులకు చెప్పేవాడు. నాలుగేళ్ళ క్రితం ఓ లేఖ రాసి.. ఎవరికీ చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పాండు కోసం కుటుబం సభ్యులు చాలాచోట్ల గాలించినా ఎక్కడా అతని ఆచూకి లభించలేదు.  అప్పటికే విరక్తిగా మాట్లాడుతూ ఉండే పాండు గురించి ఇంటి సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 

కాగా… అక్కినేని నాగార్జున కొనుగోలుచేసిన ఈ వ్యవసాయ క్షేత్రంలో చాలా ఏళ్లగా పనులేమీ జరగటంలేదు. 2018 జూలైలో ఈ వ్యవసాయ క్షేత్రంలో  కరెంట్ షాక్ కు గురై దంపతులు మరణించారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్దతుల్లో సాగు చేసేందుకు ఇటీవల నాగార్జున సతీమణి అమల ఫామ్ హౌస్ కు  వెళ్లి పనులు చేపట్టేందుకు స్ధానికంగా ఉండే కొందరికి పనులు పురమాయించి వచ్చారు. దీంతో బుధవారం గ్రామానికి చెందిన బుధ్దోలు, శ్రీశైలం అనే వారు ఫామ్ హౌస్ లోని షెడ్డులోకి వెళ్లి చూడగా అస్ధి పంజరం కనిపించింది.  వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో గురువారం ఉదయం శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి, షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌, షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ రామకృష్ణ ఫామ్ హౌస్ లోని శవాన్ని పరిశీలించారు. జేబులో  దోరికిన ఆధార్‌ కార్డు కార్డు సాయంతో మృతుడిని పాండుగా గుర్తించారు.