పెళ్ళి ప్రతిపాదన తిరస్కరించిందని టెకీపై దాడి చేసిన సెలూన్ లో పని చేసే వ్యక్తి

పెళ్ళి ప్రతిపాదన తిరస్కరించిందని టెకీపై దాడి చేసిన సెలూన్ లో పని చేసే వ్యక్తి

Refusing to get married …. a man working in a salon who stabbed a software engineer : హైదరాబాద్ లో కలకలం రేపిన టెకీ పై యువకుడు దాడి చేసిన ఘటనలో పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి సంబంధించిన వివరాలను డీసీపీ వెంకటేశ్వర్లు బుధవారం వెల్లడించారు. నిందితుడు షారూఖ్ హర్యానాకు చెందినవాడని.. హైదర్షాకోట్ లోని జావెద్ హబీబ్ సెలూన్ లో పనిచేస్తున్నాడని తెలిపారు.

బాధితురాలు, మహబూబ్ నగర్ కు చెందిన యువతి నగరంలోని ప్రముఖ ఐటీ సంస్ధలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది. తల్లితండ్రులతో కలిసి హైదర్షాకోట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. తన అపార్ట్ మెంట్ కు సమీపంలోని సెలూన్ లో పనిచేస్తున్న నిందితుడు షారుఖ్ తో ఆమెకు రెండేళ్ల కిందట పరిచయం ఏర్పడింది.

రెండేళ్ల నుంచి వారిద్దరూ స్నేహంగానే ఉన్నారు. ఆ యువతికి ఈ ఏడాది మేలో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న షారూఖ్‌.. టెకీ ని తనతోనే ఉండాలని. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతిపై ఒత్తిడి చేశాడు. దీంతో ఆమె అతడ్ని దూరం పెట్టింది. అయినా అతడు ఆమెను వేధించటం ఆపలేదు.

అతడి వేధింపులు భరించలేని ఆమె ఇటీవల షీ టీమ్స్ కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న షీ టీం సభ్యులు షారుఖ్ ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. పోలీసులు తనను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వటంతో షారుఖ్ ఆయువతిపై కక్ష పెంచుకున్నాడు. షారుఖ్ మంగళవారం ఆ యువతి నివసిస్తున్న అపార్ట్ మెంట్ వద్దకువెళ్లి మాట్లాడాలంటూ కిందకు రమ్మని పిలిచాడు.

ఆమె కిందక దిగి రాగానే తనతో తెచ్చుకున్న కత్తితో పొట్టలో, వీపుమీద, గొంతుమీద విచక్షణారహితంగా పొడిచాడు. యువతి గట్టిగా అరవటంతో యువతి తల్లి తండ్రులు కిందికొచ్చి అడ్డుకోబోయారు. షారుఖ్ వారిపై దాడిచేయటంతో వారికి గాయాలయ్యాయి. ఈ గొడవంతా చూస్తున్నస్ధానికులు వెంటనే షారుఖ్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

తీవ్రగాయాలైన యువతిని, ఆమె తల్లితండ్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా తీవ్రగాయాలైన యువతి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా….. షారూఖ్‌కు గతంలోనే పెళ్లైందని, భార్య నుంచి విడిపోయిన అతడు విడాకులు తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు.